వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం: 6 వేల మంది లెక్చరర్లు, టీచర్ల తొలగింపుపై ఫైర్
భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఖమ్మం వరద బాధితులకు సాయం అందించేలా కేసీఆర్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన, బీఆర్ఎస్ ప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు.
ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని ఆయన ఆదేశించారని హరీశ్ రావు తెలిపారు. నిత్యావసర సరుకులను గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మంలో వరదలు వచ్చాయన్నారు.

తాను ఖమ్మం వెళ్లి వరద బాధితులను పరామర్శించానని హరీశ్ రావు తెలిపారు. వారిని చూస్తే తన కళ్లలో కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం చేయడానికి అందరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు మట్టి వినాయకుని పంపిణీ చేశారు. చెరువులను కాపాడడం మన అందరి బాధ్యత అని, మట్టి వినాయకులను పూజిద్దామని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చెరువులో చేపలు చనిపోతున్నాలని, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దని అన్నారు.
రేవంత్.. ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనాత్?
రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దీన్ని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, జీతాలు అడిగినందుకు ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? అని హరీశ్ రావు నిలదేశారు. ఇదేనా ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి గారు.!
— Harish Rao Thanneeru (@BRSHarish) September 4, 2024
సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా… pic.twitter.com/1PUbP72mao
ప్రభుత్వ నిర్లక్ష్యం, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications