రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీకి మెజార్టీ ఎలా వచ్చింది..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు హరీష్ రావు కౌంటరిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. మెదక్ పార్లమెంట్ స్థానం బీజేపీ గెలవడంలో బీఆర్ఎస్ పాత్ర ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గుచేటని ఆయన తెలిపారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బీఆర్ఎస్ మెజార్టీ సాధించిందనే విషయాన్ని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ నేత రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బీఆర్ఎస్ మెజార్టీ సాధించిందని హరీష్ రావు తెలిపారు. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజార్టీ వచ్చింది.

అంటే రేవంత్ రెడ్డే అక్కడ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్‌లో బీజేపీ ఎలా గెలిచింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. అంటే వారంతా కలిసి బీజేపీని గెలిపించారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో బీజేపీ అంతటి మెజార్టీతో ఎలా గెలిచింది.. అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి వేయమని చెప్పింది ఎవరు.?
ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించిందా? అంటూ రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎదురు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేసుల భయంతో బీజేపీ పంచన చేరి, ప్రధాని మోదీ శరణు కోరారు. అందుకే తెలంగాణలో బీజేపీ ఇన్ని స్థానాల్లో విజయం సాధించగలిగిందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డే అని.. గతంలో నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించింది కూడా రేవంత్ రెడ్డే అని విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు.
మోదీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణి ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని..కేసీఆర్ ఉండగా అది సాధ్యం కాదని ఆయన తెలిపారు. విభజన హామీలను గురించి కేంద్రాన్ని ప్రశ్నించలేని రేవంత్ రెడ్డి, బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని హరీష్ రావు దుయ్యపట్టారు. రాబోవు కాలంలో ప్రజలపక్షాన పోరాడి తిరిగి అధికారంలోకి వస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications