నామినేషన్లు దాఖలు చేసిన BRS ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ కుమార్ ఈరోజు తమ నామినేషన్లను అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుకు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా మూడు శాసనమండలి స్థానాలు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం దక్కించుకున్న నాయకులు నేడు తమ నామినేషన్లు దాఖలు చేశారు.
ఎమ్మెల్యే కోట శాసనమండలి అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు అభ్యర్థులు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ కుమార్ ఈరోజు తమ నామినేషన్లను అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులుకు సమర్పించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.

ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం మార్చి 6వ తేదీన తెలంగాణలో ఎమ్మెల్యే కోటా శాసన మండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కాగా, మార్చి 13వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. మార్చి 14వ తేదీన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించి ఆపై మార్చి 16వ తేదీ వరకు ఉపసహరణకు గడువునిచ్చారు. ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు.
ఒకవేళ పోలింగ్ ఉంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించి పోలైన ఓట్లను అదే రోజున లెక్కించి విజేతను ప్రకటిస్తారు. ఇక మార్చి 25వ తేదీలోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కీలక నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఎమ్మెల్సీలుగా అవకాశాన్ని దేశపతి శ్రీనివాస్ కు, చల్లా వెంకట్రామిరెడ్డికి, నవీన్ కుమార్ కు ఇచ్చారు.












Click it and Unblock the Notifications