గ్యారంటీలకు టాటా, హామీలకు బైబై: అసెంబ్లీ సమావేశాల వేళ..
తెలంగాణ వర్షకాల శాసనసభ సమావేశాలు ఇంకాస్సేపట్లో ప్రారంభం కానున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. దీన్ని ధీటుగా తిప్పికొట్టడానికి కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. రైతులు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి అంశాలు ఈ సభలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఈ సభలో సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు గన్‌పార్క్ వద్ద ఒక భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బ్లాక్ టీ షర్టులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, నెరవేర్చని వాగ్దానాలను విమర్శిస్తూ రాసిన నినాదాలు ఆ టీషర్టులపై కనిపించాయి.

అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సామాన్య ప్రజల శ్రేయస్సును పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగాల హామీ నెరవేర్చకపోవడంతో వారు రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడి తప్పిందని, ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో వందల కొద్దీ హామీలు, ఆరు గ్యారెంటీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని తీవ్రంగా వంచించిందని ఆరోపించారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో పాటు రైతుభరోసా సాయాన్ని ఎగవేస్తూ సాగును సంక్షోభంలో నెట్టేస్తున్నారని మండిపడ్డారు.
తమ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను పగబట్టినట్లు రద్దు చేసి పేదల పొట్ట కొట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాణత్యాగాల గుర్తుగా ఉన్న అమరవీరుల సాక్షిగా తాము ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తామని ప్రకటించారు. అబద్ధాల పునాదులపై కాలం గడుపుతున్న పాలకులకు తమ నిరసన ఓ హెచ్చరిక మాత్రమేనని, మున్ముందు మరింత వ్యతిరేకతను ఎదుర్కొనక తప్పదని స్పష్టం చేశారు.
#WATCH | Hyderabad | BRS Working President KTR, MLA Harish Rao and others staged a protest at Gunpark wearing black T-shirts bearing slogans against the Congress government's 1000 days of rule in the state. pic.twitter.com/teuwBgFtrT
— ANI (@ANI) September 7, 2026












Click it and Unblock the Notifications
