తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చే అంశాలు: 21 ఏళ్లకు తగ్గింపుపై
తెలంగాణ వర్షకాల శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. దీన్ని ధీటుగా తిప్పికొట్టడానికి కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. రైతులు, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి అంశాలు ఈ సభలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఈ సభలో సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రస్తుతం ఉన్న కనీస వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదనను గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా సమర్థించారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత బాధ్యతాయుతమైన ఉద్యోగాలలో చేరడానికి యువతకు 21 ఏళ్ల వయసు పరిగణనలోకి తీసుకున్నప్పుడు చట్టసభల్లో అడుగుపెట్టే విషయంలో ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ఆయన వాదించారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావించింది.
ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఇంకా స్పష్టమైన ఆమోదం తెలపలేదు. ఓ రాష్ట్రంలో ఈ విధానాన్ని ప్రవేశపెడితే ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీపై ఒత్తిడి పెరుగుతుందని హైకమాండ్ భావిస్తోంది. దీనిపై పార్టీ జాతీయ స్థాయిలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ప్రస్తుత సమావేశాలలో దీనిపై తీర్మానం ప్రవేశపెడతారా లేదా అనే అంశంపై రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ అసెంబ్లీ సమావేశాల అజెండాలో పలు కీలక అంశాలు ఉండనున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్, పీఎం శ్రీ ఆడిట్ నివేదికలతో పాటు కీలకమైన మెట్రో రైల్ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. వీటితో పాటు భూ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. తీవ్ర దుమారం రేపుతున్న 22ఏ భూముల తరలింపు వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
22ఏ భూ సమస్యపై ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం.. ధరణి, భూ భారతి వంటి అంశాలతో రంగం సిద్ధం చేసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం, ఇంటర్మీడియట్-పదో తరగతి విద్యా విధానాలు వంటి విద్యా రంగ పరిణామాలు కూడా సభలో ప్రస్తావనకు రానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications