లేదు లేదంటూనే..: సైంటిస్టులకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ప్రైవేటీకరణపై కొన్ని రోజులుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడింది. ఇస్రో మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్ విభాగాలను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే ప్రతిపాదనపై ఉద్యోగులలో ఆందోళన వ్యక్తమౌతోన్న నేపథ్యంలో కేంద్రం వారికి స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా రాసిన లేఖకు స్పందించింది. ఇస్రో, ఉద్యోగుల భవిష్యత్తుపై తన వైఖరిని స్పష్టం చేసింది.
కొంతకాలంగా ఇస్రోలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం అనూహ్యంగా పెరగడం పట్ల తొమ్మిది ఉద్యోగ సంఘాలు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి, ఛైర్మన్ వీ నారాయణన్‌కు ఓ సుదీర్ఘ లేఖ రాసిన విషయం తెలిసిందే. గుండెకాయగా భావించే మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషనల్ యూనిట్లు, వాటి టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలపై అధికారికంగా సరైన వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఆగస్టు 21న ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా చేసిన వ్యాఖ్యలే ఈ భయాందోళనలకు దారితీసినట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. ఇస్రో అభివృద్ధి చేసిన టెక్నాలజీ అనేది జాతీయ ఆస్తి అని, దీన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టకూడదని తేల్చి చెప్పారు. ఇస్రో కాలానుగుణంగా వ్యూహాత్మకంగా మార్పులు ఉండాలే తప్ప ప్రైవేట్ కు టెక్నాలజీని బదలాయించడం గానీ, దీన్ని ప్రైవేటీకరించడం గానీ మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
దీనిపై పవన్ గోయెంకా, నారాయణన్ వేర్వేరుగా స్పందించారు. వివరణ ఇచ్చారు. ప్రభుత్వేతర పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఇస్రో వాణిజ్య విభాగ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్న టెక్నాలజీని బదలాయించడమే దీని వెనుక ఉన్న వ్యూహమని పేర్కొన్నారు. ఈ విధానాల వల్ల ఇస్రో ఎంతమాత్రం బలహీనపడదని, సైంటిస్టులు ఆర్ అండ్ డీపై దృష్టి కేంద్రీకరించడానికి వీలుంటుందని స్పష్టం చేశారు.
ఇస్రోను నిర్వీర్యం చేయడం గానీ, ప్రైవేటీకరించడం గానీ చేయబోమని, ఈ ఆలోచన తమకు లేనప్పటికీ.. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరగడం ద్వారా భవిష్యత్తులో చేపట్టబోయే నెక్స్ట్ జెన్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యం పరిమితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Clarification regarding media reports on concerns relating to Space Sector Reforms and the role of ISRO
— ISRO (@isro) September 6, 2026
ISRO’s Next Chapter: Leading India’s National Space Ecosystem
There has been considerable reporting in parts of the media around the future role of ISRO including speculations…
భవిష్యత్తులో అధునాతన సాంకేతికత అభివృద్ధి, గగన్‌యాన్, నెక్స్ట్ జెన్ ప్రయోగాలు, గ్రహాల అన్వేషణ, అంతరిక్ష పరిశోధనలు, వ్యూహాత్మక జాతీయ రక్షణ సామర్థ్యాలను పెంపొందించే రంగాలలో ఇస్రో పాత్ర మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. 2035 నాటికి సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, 2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపడం వంటి భారీ లక్ష్యాలను ఇస్రో నిర్దేశించుకుందని గుర్తు చేశారు.














Click it and Unblock the Notifications