Manmohan Singh: పీవీ, మన్మోహన్ సింగ్ ను దగ్గరుండి చూశా.. వారు గొప్ప మేధావులు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పీవీ నరసింహరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకున్నారు. పీవీతో కలిసి సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశం ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉందని చెప్పారు. పీవీ నరసింహ రావు ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలిపారు.
అలాంటి సమయంలోనే పీవీ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చారని గుర్తు చేశారు. సింగ్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా దేశం కోసం పీవీ నరసింహ రావు గారు మన్మోహన్ కు ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారని వివరించారు. ఇద్దరు కలిసి దేశాన్ని గట్టెక్కించారని కొనియాడారు. వారిద్దరు స్నేహితుల్లాగానే ఉండేవారని వాణి దేవి గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారని చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక నిపుణుడిగా ఎదిగారని పేర్కొన్నారు.

మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్ కూడా మంచి సేవలు చేశారని చెప్పారు. పీవీ నరసింహ రావు ఆయనలోని ప్రతిభను చూసి ఆర్థిక మంత్రిగా తీసుకున్నారని గుర్తు చేశారు. పీవీ మన్మోహన్ కు స్వేచ్ఛగా ఇచ్చారని.. దీంతోనే ఆయన మంచి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ దొరికిందని తెలిపారు. 2008 ఆర్థిక మాంద్యంతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే.. ఇండియాలో మాత్రం అంతగా ప్రభావం చూపలేదన్నారు. దీనికి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణంగా ఆమె పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ మృదు స్వభావని అని వాణి దేవి గుర్తు చేశారు. ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా నడుచుకున్నారని గుర్తు చేశారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. సర్వ శిక్షా అభియాన్, సమాచార హక్కు చట్టం తీసుకురావడం గొప్ప విషయంగా అభివర్ణించారు. పీవీ, మన్మోహన్ సింగ్ 24 గంటల్లో 18 గంటలు పనిచేసే వారని వివరించారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక క్రమ శిక్షణ అవసరమని వాణి దేవి నొక్కి చెప్పారు. కాగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియాల్లో పాల్గొనేందుకు ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications