బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్: ఆందోళనలు; పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనాలు!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటాపోటీగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఉచిత విద్యుత్తు అంశంపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరసనలకు పిలుపునివ్వడంతో అన్ని జిల్లాలలోనూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మల దహనాలు, రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో రైతులు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలోనితెలంగాణ చౌక్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు ఉరి తీసి నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో పాల్గొని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. నేడు బీఆర్ఎస్ ఆందోళనలకు పోటీగా వారు కూడా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు నిరసనగా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నేతలు దగ్ధం చేశారు.

ఇక మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక పోటాపోటీ ఆందోళనలతో దిష్టిబొమ్మల దహనాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications