పటాన్‌చెరులో దారుణం... మర్మాంగాలు కోసి వ్యక్తి దారుణ హత్య...
హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. చిట్కుల్ గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కిరాతకంగా హతమార్చారు. అతని మర్మాంగాలు కోసి హత్యకు పాల్పడ్డారు. స్థానికులు అతని మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే... పటాన్‌చెరు మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి(32) మద్యానికి బానిసయ్యాడు. పనీ పాట లేకుండా నిత్యం తాగుతూ జులాయిగా తిరుగుతున్నాడు. తాగడం,భార్యతో గొడవపడటం అతనికి దినచర్యగా మారింది. అతని బాధలు భరించలేక తల్లి బంధువుల వద్ద ఉంటోంది.

ఇదే క్రమంలో యాదగిరి(జులై 25) పీకలదాకా తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. అదే రోజు రాత్రి గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతని తలపై బండరాయితో మోది హత్య చేశారు. అతని మర్మాంగాలను కోసేశారు. మరుసటిరోజు ఉదయం స్థానికులు అతని మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.
యాదగిరి గతంలో ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో అతనిపై దొంగతనం కేసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో యాదగిరిపై పగతో ఎవరైనా హత్యకు పాల్పడ్డారా లేక మరో కోణం ఉందా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. యాదగిరి కుటుంబ సభ్యులను సైతం విచారించనున్నారు. క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్‌లతో ఇప్పటికే ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications