RS Praveen Kumar : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బీఎస్పీ కార్యకర్తల వార్నింగ్-అది మింగుడుపడకనే ఇలాంటి విమర్శలని...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. తెలంగాణ రాష్ట్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని కోరుకుంటోందని... అది మింగుడుపడకనే గాదరి కిశోర్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బీఎస్పీ నేతలు,కార్యకర్తలు మండిపడ్డారు. బహుజన నేతలపై తప్పుడు ప్రచారాలు,ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. గాదరి కిశోర్ వ్యాఖ్యలను నిరసిస్తూ నల్గొండ బీఎస్పీ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టారు.

బీఎస్పీ కార్యకర్తల రియాక్షన్...
ఇంకా ఆరున్నరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ తన ఉద్యోగాన్ని త్యజించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికారం కోసం ప్రజల్లోకి వచ్చారని బీఎస్పీ నేతలు అన్నారు. రెండేళ్ల గడువు ఉన్న నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగలవా అని గాదరి కిశోర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఆదివారం(అగస్టు 8) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ఆరంగేట్ర సభ జరిగిన సంగతి తెలిసిందే. బహుజన రాజ్యాధికార సంకల్ప సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై,ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆ విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్,సైదిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

ఆ భయాందోళనతోనే ప్రవీణ్ బయటకొచ్చాడు : గాదరి కిశోర్
ఉద్యోగం ఉంటుందో ఉండదోననే భయాందోళన నుంచి జాతి కోసం బయటకొచ్చినట్లు ప్రవీణ్ కుమార్ కలరింగ్ ఇస్తున్నారని గాదరి కిశోర్ ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.దళితబంధుకు ప్రవీణ్ కుమార్ వ్యతిరేకమా? అనుకూలమా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత జాతి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. వాటిల్లో అధికారికంగా పాలు పంచుకున్న ప్రవీణ్.. ప్రభుత్వంపై,ముఖ్యమంత్రిపై ఇలాంటి విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దళితుల కోసం ఏమీ చేయని, ఇస్తామన్న ఉద్యోగులు కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కుమార్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉండి.. ఇష్టారీతిన వ్యవహరించినందుకు ఆయనపై కేసులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఆ భయాందోళనతో జాతికోసం బయటకు వస్తున్నట్లు ప్రవీణ్ నాటకమాడారని విమర్శించారు. తనను తాను రక్షించుకునేందుకే బహుజన్ సమాజ్‌పార్టీలో చేరారని అన్నారు. బీజేపీ తల్లి పార్టీ అయితే బీఎస్పీ పిల్ల పార్టీ అన్నారు. తెలంగాణ దళిత జాతిని ఇవన్నీ గమనించాలన్నారు.

ప్రవీణ్ కుమార్‌పై సైదిరెడ్డి విమర్శలు
'నల్లగొండ చాలా చైతన్యవంతమైన జిల్లా. 12 సీట్లలో 11 సీట్లు గెలిచాం. ఏది మంచి ఏది చెడు అనేది ప్రజలకు తెలుసు. చిన్న యూట్యూబ్ చానెల్ మొదలు మోదీ వరకు దేశం మొత్తానికి కేసీఆర్ ఒక్కడే కనబడుతాడు. కేవలం కేసీఆర్‌ను విమర్శిస్తే ఎదుగుతామనే ఆలోచన తప్ప సొంత ఎజెండా లేదు.నాయకుడిగా ఎదగాలంటే గొప్పోడిగా చూపించుకునే మాటలు మాట్లాడాలి గానీ ఎంతసేపు కేసీఆర్,కేటీఆర్,టీఆర్ఎస్‌లను తిట్టడం మీ స్థాయికి తగినది కాదు. మీరు మాట్లాడే మాటలతో ప్రజల్లో కేసీఆర్‌పై మరింత ప్రేమ పెరుగుతోంది. నాయకుడిగా ఎదగాలంటే కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచించాలి. అప్పుడే జనం ఆదరిస్తారు. అంతేగానీ ఇలా మాట్లాడితే ప్రజలు హర్షించరు. బీజేపీ,బీఎస్పీ పాలించిన రాష్ట్రాల్లో కేసీఆర్ పెట్టిన పథకాలేవైనా పెట్టగలిగారా..' అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు.

ప్రవీణ్ కుమార్ ఏమన్నారు...
నల్గొండ సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... కారు కింద పడుతారా.. ఏనుగెక్కి ప్రగతి భవన్ వెళ్తారా తేల్చుకోవాలని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ ఉత్సాహం చూస్తుంటే.. ప్రగతి భవన్ దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తోందన్నారు.ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోదాం.. ఏనుగు ఎక్కి ఎర్రకోటలో నీలి జెండా ఎగరేద్దామని అన్నారు.లక్షలాది మంది పేదల గొంతుకగా మారేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. బంగారు తెలంగాణలో కొందరి బతుకులు మాత్రమే బాగు పడ్డాయని, నాలాగా లక్షల మంది బిడ్డలను చైతన్యం చేయడానికి సోషల్ వెల్ఫేర్‌లో పనిచేశానని చెప్పారు.
బహుజన రాజ్యంతోనే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఊరు అవతల ఉండే వీళ్లకు ఏం చేతకాదు అని ఎద్దేవా చేసిన వాళ్లకు సమాధానంగా ఒక దళిత బిడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ ఎగరేసేలా చేశారన్నారు. తెలుగే సరిగా రాదు ఇంగ్లీష్ వస్తుందా అని ఎగతాళి చేసిన వాళ్లకు.. విదేశాల్లో మన బిడ్డల చదువులే నిదర్శనం అన్నారు. కరోనా సమయంలో పేద దళిత బిడ్డలకోసం ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువులు చెప్పిస్తుంటే.. కేంద్రం ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రి ఆ పిల్లలను ఇంటికి వెళ్లగొట్టారని, నన్ను ఏమీ చేయనీయకుండా చేతులు కట్టేసి.. కేసులు బనాయించి వెనక్కి నెట్టే కుట్ర జరిగిందని అన్నారు.

కేసీఆర్ మాయ మాటలకు చరమగీతం పాడుతామని...
ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు ప్రవీణ్ కుమార్.సంక్షేమ పథకాలు, దళిత బంధు పైసలు ఎవరివి.. మావి కాదా..? అని ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్... పేద పేద బడుగు బలహీనవర్గాల కష్టపడిన సొమ్ము తోనే కేసీఆర్ విచ్చలవిడిగా దుబారా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. పేదలపై,దళితులపై మీకు అంత ప్రేమ ఉంటే... మీ సొంత ఆస్తులను అమ్మి ఖర్చు పెట్టండని అన్నారు. బహుజన రాజ్యం సాకారమయ్యే కల దగ్గరలోనే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొక్కుబడిగా విద్యా వ్యవస్థ పై ఖర్చు పెడుతుందని, మొత్తం 60 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం ఆరు లక్షల మంది మాత్రమే గురుకులాల్లో పూర్తిస్థాయి బోధన జరుగుతోందన్నారు. అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఏ వర్గాల కోసం పాటు పడుతుందో చెప్పాలన్నారు. గత ఏడేళ్ల లో ఎన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చారని ప్రశ్నించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications