RS Praveen Kumar: వట్టే జానయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూర్యాపేటలో పర్యటించారు. సూర్యాపేట డీసీఎంఎస్ ఛైర్మన్ వట్టే జానయ్య తల్లిని ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. సూర్యాపేటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ప్రవీణ్ కుమార్ అన్నారు. సూర్యాపేట పట్టణం కాశ్మీర్ కాదని, తాము ఉగ్రవాదులం కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ పార్టీని చూసి మంత్రి జగదీష్ రెడ్డి భయపడుతున్నారని.. వట్టే జానయ్య విషయంపై వాస్తవాలు మాట్లాడుకోవడానికి చర్చకు సిద్ధమా అంటు ప్రవీణ్ సవాల్ విసిరారు.
ఈ విషయంలో తాను ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చి చర్చిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరు అణిచివేతకు గురైనా బీఎస్పీ పార్టీ తరఫున తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వట్టే జానయ్య కు అన్యాయం జరిగిందని ఆర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఎవరైనా ఆత్మగౌరవం చంపుకుని పని చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బహుజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా తాము ప్రశ్నిస్తామని ప్రవీణ్ కుమార్ స్పష్ట చేశారు. తెలంగాణ సమాజానికి జానయ్య తల్లి వట్టే అయిలమ్మ స్ఫూర్తి ఇచ్చారని చెప్పారు.

గాంధీనగర్ లో ఆంక్షల నడుమ సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. జానయ్యపై కేసులు నమోదైనప్పటి నుంచి ఆయన ఇంటికి కరెంట్ బంద్ చేశారని వివరించారు. ఆగస్ట్ 25వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించిన బీసీ గర్జన కార్యక్రమానికి జానయ్య హాజరుకావడంతో మంత్రి జగదీష్ రెడ్డికి భయం పట్టుకుందని అన్నారు. జానయ్య కొడుకు పెళ్లికి 50 వేల మంది వస్తే.. బీసీ బిడ్డ ఇంటికి 50 వేల మంది ఎలా వస్తారని జగదీష్ రెడ్డి భయం పట్టుకుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బానిస బతుకులు బతకాలని రెడ్లు శాసిస్తున్నారని ప్రవీణ్ కుమార్ చెప్పారు.
తాను 26 సంవత్సరాలు పోలీస్ శాఖలో పని చేశానని, ఎప్పుడు కూడా ఇలాంటి నిర్బంధపు ఆంక్షలు చూడలేదన్నారు. అధికార పార్టీ నాయకులు అరెస్ట్ చేయమంటే చేస్తున్నారని, కేసులు పెట్టమంటే పెడుతున్నారని అన్నారు. కాగా వట్టే జానయ్యపై ఓ మహిళ పలు ఆరోపణలు చేసింది. వట్టే జానయ్య యాదవ్ తన 100 గజాల స్థలాన్ని అక్రమించుకున్నారని దొనకాని స్వాతి ఆరోపించారు.












Click it and Unblock the Notifications