ఖైరతాబాద్ తో పాటుగా మరో నియోజకవర్గానికి ఉప ఎన్నిక, రేవంత్ బిగ్ ప్లాన్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. దానం నాగేందర్ పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయమైంది. సుప్రీం కోర్టులోనూ దానంకు రిలీఫ్ దక్కలేదు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు దగ్గరైన మిగిలిన ఎమ్మెల్యేల్లోనూ ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో ఖైరతాబాద్ తో పాటుగా మరో అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. దానం పై అనర్హత వేటు తో అధికార కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.
ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. దీంతో... ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక పైన కోర్టు స్పష్టత ఇచ్చింది. బీఆర్ఎస్ ఇప్పటికే ఉప ఎన్నిక కోసం తమ అభ్యర్ధిని దాదాపు ఖరారు చేసింది. దానం నాగేందర్ తిరిగి తాను పోటీ చేయటంపైనా కీలక వ్యాఖ్యలు చేసారు. ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది.

ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఖైరతాబాద్ సీటు ఖాళీ అయినట్లుగా సమాచారం అందించారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త చర్చ మొదలైంది. ఖైరతాబాద్ తో పాటుగా మరో అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చేలా వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పైన ఫోకస్ చేసే విధంగా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనేది అధికార పార్టీ వ్యూహం. అందులో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా అనర్హత అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది.
ఒకే సారి రెండు నియోజకవర్గాలకు బై పోల్..?
ఒకే సారి రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు తీసుకొచ్చి బీఆర్ఎస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాలన్నది సీఎం రేవంత్ ప్లాన్‌గా కనిపిస్తోంది. శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే శాసనసభ ప్రివిలేజ్ కమిటీ విచారణను ముమ్మరం చేసింది.
ప్రివిలేజ్ కమిటీ ఇచ్చే సిఫారసుల ఆధారంగా కౌశిక్ రెడ్డిపై శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ సైతం అంచనా వేస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలపైన అనర్హత వేటు వేసారు. దీంతో... ఇప్పుడు దానం పైన వేటు పడటంతో... ఇటు కౌశిక్ రెడ్డి పైన చర్యల దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే జరిగితే ఖైరతాబాద్ తో పాటుగా హుజూరాబాద్ కు ఒకే సమయంలో ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.













Click it and Unblock the Notifications
