బాబుకు నోటీసులిస్తారా, ఏం చేయాలి: గవర్నర్ ఢిల్లీ టూర్ 'సీరియస్' పైనేనా?
హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అందరిలోను ఉత్కంఠను రేపుతోంది. సెక్షన్ 8, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితి పైన కేంద్రంతో గవర్నర్ చర్చించనున్నారని తెలుస్తోంది.
అదే సమయంలో మరో రకమైన ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కూడా తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్.. రేవంత్ రెడ్డి వీడియో, చంద్రబాబు - స్టీఫెన్ సన్‌తో మాట్లాడినట్లుగా భావిస్తున్న ఆడియోను పరిశీలించి కోర్టుకు సమర్పించింది. అందులో ఎలాంటి కట్ అండ్ పేస్ట్‌లు లేవని చెప్పింది. ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదికను తమకు ఇవ్వాలని కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో వాటిని పరిశీలించిన అనంతరం ఏసీబీ ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు నోటీసులు జారీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు నోటీసులు ఇస్తే రెండు రాష్ట్రాల్లోను ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినా, బాబు పేరును నిందితుడిగా చేర్చినా అది సీరియస్ ఇష్యూ అవుతుంది. దీంతో, తదనంతర పరిణామాల పైన చర్చించేందుకే గవర్నర్‌కు ఢిల్లీ పెద్దలు పిలిపించి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
నరసింహన్ శుక్రవారం ఉదయం పది పదకొండు గంటల మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ పైన తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని టీడీపీ చెబుతోంది. దాంతో పాటే సెక్షన్ 8 కోసం డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలన్నింటి పైన గవర్నర్‌తో చర్చించవచ్చంటున్నారు.












Click it and Unblock the Notifications