తెలుగురాష్ట్రాల కృష్ణా జలజగడంపై కేంద్రం ఫోకస్.. దసరా తర్వాత ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే యోచన!!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కోసం వార్ కొనసాగుతూనే ఉంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా జలాల పంపిణీ విషయంలో, కృష్ణా జలాల వినియోగం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రస్థాయిలో ఘర్షణలకు దిగుతున్న విషయం తెలిసిందే. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండు రాష్ట్రాల సమస్యను పరిష్కరించుకోవడంలో విఫలమౌతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్రం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక తాజాగా మరోమారు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న కృష్ణాజలాల జగడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటీ మీటింగ్ లోనూ నదీజలాల వివాదాలపై అమిత్ షా సూచన
నదీజలాల భాగస్వామ్య సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని అన్వేషించాలని ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరైన 30వ దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను కోరారు. దక్షిణాదిలోని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలలో తమిళనాడు మరియు కర్ణాటకల మధ్య కావేరి సమస్య మరియు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించిన కృష్ణా నదీ జలాల భాగస్వామ్య వివాదం ఉన్నాయి. ఇక ఇదే సమయంలో కేంద్రం కూడా త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని యోచిస్తోంది.

తెలంగాణా వరుస లేఖలతో కేఆర్ఎంబీకి కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు
కృష్ణా జలాల వినియోగం, కేటాయింపులలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దసరా తర్వాత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కృష్ణా జలాల పంపిణీపై కృష్ణానది యాజమాన్య బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ తెలంగాణ ప్రభుత్వం పదేపదే కేంద్రానికి లేఖలు రాయడంతో అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో తమకు తెలియజేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కేఆర్ఎంబీ నివేదిక ఇస్తే దసరా తర్వాత కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి సమావేశం
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపై, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల పై, ఇరు రాష్ట్రాలు ఒక రాష్ట్రంపై ఒకటి వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై సమగ్ర నివేదికను కేంద్ర జల శక్తి శాఖకు పంపించనుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నివేదిక అనంతరం దసరా పండుగ తర్వాత జలశక్తి శాఖ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే అనేక మార్లు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి సమావేశాలు జరిగినా, వివాదాలు మాత్రం పరిష్కారం కాలేదు. మరి ఇప్పుడైనా కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీకి చెక్ పడుతుందో లేదో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications