తెలంగాణాకు కేంద్రం షాక్.. దారి మళ్లించిన నిధులను రెండు రోజుల్లో చెల్లించాలని నోటీసులు!!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల కాలంలో కేంద్రం రాష్ట్రం పై ఐటీ, ఈడీ దాడులతో విరుచుకు పడుతున్నట్టు రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక కేంద్రంలోని బీజేపీ కీలక నేతలను ఇరికించటం కోసం ఎమ్మెల్యేల ఎర కేసుతో టార్గెట్ చేస్తున్నట్టు బిజెపి అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రంలోని బిజెపి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ క్రమంలో రెండు రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ వార్ తాజా పరిణామంతో పీక్స్ కు చేరింది.

తెలంగాణా సర్కార్ కేంద్రం షాక్.. ఆ నిధులు వెంటనే కేంద్రానికి చెల్లించాలని నోటీసులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను వేరే పథకాల కోసం దారి మళ్లించినట్లుగా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో జరిగిన అవకతవకలపై తెలంగాణ రాష్ట్రం పై సీరియస్ అయిన కేంద్రం, దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.

రెండే రోజులు గడువిచ్చిన కేంద్రం .. లేదంటే తదుపరి వాయిదాలు నిలిపివేస్తామని వార్నింగ్
రెండు రోజుల్లో నిధులు చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ అలా చెల్లించని పక్షంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇవ్వాల్సిన తదుపరి వాయిదాలు నిలిపివేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దారి మళ్లింపు పై జూన్ 9వ తేదీ నుండి 12వ తేదీ మధ్య కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించింది. ఈ క్రమంలో ఉపాధి హామీ నిధులను అనుమతి లేకుండా వివిధ పథకాలకు వినియోగించినట్టు కేంద్ర బృందం గుర్తించింది. అంతేకాదు ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్న తీరులోనూ, పనుల కేటాయింపులోనూ పలు అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. దీనిపై సమగ్ర నివేదికను కేంద్రానికి అందించింది.

కేసీఆర్ కేంద్రం నోటీసుపై ఎలా స్పందిస్తారో?
ఉపాధి హామీ నిధులతో చేపలు ఎండబెట్టి ప్లాట్ ఫాం లను, అడవుల్లో ట్రెంచ్ ల తవ్వకాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టి నిధులను ఖర్చు చేసినట్లుగా కేంద్ర బృందం తన నివేదికలో వెల్లడించింది. ఇక ఈ క్రమంలోనే దారి మళ్లించిన నిధులను తిరిగి చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. నవంబర్ 30వ తేదీలోగా దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను చెల్లించకపోతే, గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక మరి కేంద్రం ఇచ్చిన నోటీసులకు సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు? కేంద్ర ఆదేశానుసారం కెసిఆర్ నిధులను దారి మళ్ళించామని అంగీకరించి కేంద్రం ఆదేశాల మేరకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారా? లేక కేంద్రం ఆదేశాలను ధిక్కరించి, కేంద్రంపై ఎదురుదాడి చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications