యాదగిరి గుట్ట భక్తులకు కేంద్రం ఊహించని వరం - ఇక కొండ పైకి నేరుగా..!!
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఆలయంలో భక్తుల కోసం అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా, కింద నుంచి కొండపైకి వెళ్లడానికి భక్తులకు చాలా కష్టంగా ఉంటోంది. ఈ సమస్యకు చెక్ పెట్టి మరింత సులభంగా భక్తులు కొండ మీదకు వెళ్లేందుకు కేంద్రం తాజా నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. భక్తులు ఇక నడిచి వెళ్లే అవసరం లేకుండా కొండ పైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
కేంద్రం యాదగిరి గుట్టకు రోప్ వే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యాదగిరి గుట్టతో పాటుగా రాష్ట్రంలో మరో మూడు చోట్ల రోప్‌వేలను ఏర్పాటు చేయనున్నారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ-ఎన్హెచ్ఏఐ పరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కు ఈ బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 1.1 కిలోమీటర్లు రోప్‌వేను నిర్మించనున్నారు. అలాగే నల్గొండలోని హనుమ కొండకు 1.2 కిలోమీటర్లు, నాగార్జునకొండ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ వరకు 1.7 కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లా మంథనిలోని రామగిరికోటకు 2.4 కిలోమీటర్ల మేర రోప్ వే ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది.

కాగా, ఈ ప్రాజెక్టు కోసం అక్టోబర్ 21 వరకు ఈ బిడ్ల సమర్పణకు అవకాశం కల్పించారు. కేంద్రం దేశవ్యాప్తంగా 200 రోప్‌వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఉత్తరా ఖండ్ లో రెండు, తెలంగాణలో 4 రోప్‌వేలకు పచ్చజెండా ఊపింది. అనంతరం ఈ ప్రక్రియను ప్రారంభించింది. వారాంతాలు, పర్వదినాల్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఘాట్ రోడ్డులో వాహనాలు బారులతో రద్దీగా మారుతుంటాయి. ఈ క్రమంలో కొండ దిగువ నుంచి రేప్ వేను ఏర్పాటు ద్వారా భక్తులకు నేరుగా కొండ పైకి చేరుకునే వెసులుబాటు కలగనుంది. నాగార్జునకొండకు కృష్ణానదిపై నుంచి రోప్ వే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ఎంఎంటీఎస్ రైళ్ల సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టును ఎట్టకేలకు రైల్వేశాఖ పట్టాలు ఎక్కించింది.












Click it and Unblock the Notifications