ఎమ్మెల్యేల ఎర వ్యవహారంలో రంగంలోకి కేంద్రం - నిగ్గు తేల్చే పనిలో..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారంటూ విడుదల చేసిన వీడియోలు.. చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నేరుగా కేంద్రంలోని ముఖ్యలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తుండటం పై కేంద్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా బీజేపీ ముఖ్య నేతలు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేస్తున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ వీడియోలను సుప్రీం - అన్ని రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలకు పంపారు.
దీనికి బీజేపీ వ్యతిరేక పార్టీలు అవకాశంగా మలచుకొనే అవకాశం కనిపిస్తంది. ఇప్పటికే ఆప్ నేతలు దీని పైన స్పందించారు. దీంతో...ఆ వీడియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరు..వారికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కేంద్రం విచారణ ప్రారంభిచినట్లుగా తెలుస్తోంది. ఆడియో, వీడియో రికార్డులపై లోతుగా విశ్లేషణ చేపట్టనున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారం పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో కూడా విచారణ చేయించే ఆలోచనలో మోదీ సర్కార్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ - గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోల వ్యవహారం దేశ వ్యప్తంగా చర్చకు కారణమవుతోంది. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ బయట పెట్టిన వీడియోలు - వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఇక, ఈ నెల 12న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారం పైన పీఎంఓ ఆరా తీస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల సేకరణ ప్రారంభమైందని చెబుతున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి నకలీ ఆధార్ కార్డులతో పాటుగా పాన్ కార్డులు బయటకు రావటంతో అసలు ఈ ముగ్గురి నేపథ్యం ఏంటనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సమయంలో రామగుండంలో బహిరంగ సభకు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆలోగానే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం - పార్టీలోని ముఖ్యుల పేర్లను ఆ ముగ్గురు ప్రస్తావించటంతో బీజేపీ అధినాయకత్వం కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది. రాజకీయంగా .. న్యాయపరంగా ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశం పైన కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. దీంతో, ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications