Telangana Governor: తెలంగాణ గవర్నర్ మార్పు ? ఎంపీగా పోటీకి తమిళి సై..!
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అయిన తమిళిసై సౌందరరాజన్ తన పదవిని వదులుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆమె.. ప్రస్తుతం ఉన్న గవర్నర్ పదవిని వదులుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో పెద్దల్ని కలిసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. గతంలో తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై పలు ఎన్నికల్లో పోటీ చేశారు.
తెలంగాణలో నిన్న మొన్నటివరకూ కేసీఆర్ ప్రభుత్వంతో అమీతుమీ అన్నట్లుగా వ్యవహరించిన తమిళిసై సౌందర రాజన్ కు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కాస్త ఊరట లభించింది. కొత్త ప్రభుత్వం కావడంతో మరికొంతకాలం ఆమె వేచి చూసే అవకాశాలు ఉంటాయి. దీంతో ఎలాగో గతంలో తాను పోటీ చేసిన తమిళనాడు నుంచి మరోసారి ఎంపీగా అదృష్టం పరీక్షించుకోవాలని తమిళిసై భావిస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో ఢిల్లీ వెళ్లబోతున్న గవర్నర్ తమిళి సై తన మనసులో మాటను హైకమాండ్ కు చెప్పి బీజేపీ టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. అధిష్టానం ఓకే అంటే తమిళనాడు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆమె సిద్దమవుతున్నారు. అప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ప్రత్యామ్నాయంగా తమిళనాడులో బీజేపీ కాస్త పుంజుకున్నట్లు తమిళిసై భావిస్తున్నారు. అందుకే ఈసారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే గతంలో మూడుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్ కూ పోటీ చేసినా తమిళిసై సౌందర రాజన్ బోణీ కొట్టలేకపోయారు. కానీ ఈసారి పరిస్ధితుల్లో మార్పు కనిపిస్తోందని ఆమె అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే గవర్నర్ పదవుల్ని వదులుకుని మరీ ఎంపీగా పోటీ చేసేందుకు తమిళి సై మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. అదే జరిగితే తమిళి సై స్ధానంలో తెలంగాణ గవర్నర్ గా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని నియమనించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications