జాగ్రత్త! సిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్: ‘ఖాకీ’ని తలపించేలా దోపిడీలు!
Recommended Video
హైదరాబాద్: నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు మరోసారి కలకలం రేపారు. ఘట్కేసర్ పోలీస్ పరిధిలోని రాత్రివేళ చెడ్డీ గ్యాంగ్ మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించింది. వారికి విలువైన వస్తువులు దొరక్క పోవడంతో చిన్న చిన్న వస్తువులు ఎత్తుకెళ్లారు.
నెట్లో వీడియోలు: భారతమాతను కించపర్చిన బ్రదర్ విజయ్ అరెస్ట్
కాగా, ఆయా గ్రామాల్లో వీరు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవడం గమనార్హం. దీంతో నగర శివార్లలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందనే ఆధారాలు రాచకొండ పోలీసులకు లభించినట్లయింది. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లేవారు, గ్రామ శివార్లలో ఉన్న ఇళ్లనే వీరు లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు చెబుతున్నారు.
మారణాయుధాలతో సంచరిస్తూ..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్‌లు నగరంలోని, శివారులోని ప్రాంతాల్లో దోపిడీలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఒక్కో గ్యాంగ్‌లో పది మంది వరకు ఉంటారు. వీరు మారణాయుధాలతో సంచరిస్తుంటారు.
ప్రాణాలు తీసేందుకూ వెనుకాడరు..
దోపిడీ సమయంలో ఎవరైనా అడ్డగిస్తే ప్రాణాలు తీసేందుకు సైతం వీరు వెనుకాడరు. దీంతో ఈ గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా, చెడ్డీ గ్యాంగ్ సభ్యులు చెడ్డీలు, బనియన్లు ధరించి, ముఖానికి ముసుగు వేసుకుంటారని తెలుస్తోంది.
వారి టార్గెట్ ఆ ఇళ్లే..
ఎక్కువగా వీరు తాళం వేసిన ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతుంటారు. ఈ చెడ్డి గ్యాంగుకు మరో పేరు కచ్చా బనియన్ గ్యాంగ్. శరీరానికి ఒండు మట్టి గానీ నూనె గానీ రాసుకుని వీరు సంచరిస్తుండటం గమనార్హం. ఎవరైనా పట్టుకునేందుకు ప్రయత్నించినా వీరు దొరక్కుండా జారిపోయేందుకే ఈ ప్లాన్.
పగలు రెక్కీ మాత్రమే..
పగలు కుర్తా లేదా లుంగీ ధరిస్తారు. అంతేగాక, ఈ గ్యాంగ్ ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో లేదా కాలనీల్లో ఉన్న ఖాళీ ప్లాట్లలో బస చేస్తారు. పగలు బిచ్చగాళ్లు లేదా కూలీలుగా నటిస్తూ గ్రామాలు, కాలనీల్లో వీరు సంచరిస్తూ రెక్కీ నిర్వహిస్తారు. ఆ తర్వాత తాళం వేసిన ఇళ్లలో రాత్రిళ్లు దోపిడీకి పాల్పడతారు.
ఖాకీని పోలిన దోపిడీలు
ఈ గ్యాంగ్ ఒకే రాత్రి రెండు, మూడు ఇళ్లలో దోపిడీకి పాల్పడతారని తెలిసింది. ఘట్ కేసర్లో ఈ చెడ్డీ గ్యాంగ్ ప్రస్తుతం సంచరిస్తున్న ఆధారాలు దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరి ఆట కట్టించేందుకు పోలీసులు రాత్రి వేళలో గస్తీ నిర్వహిస్తున్నారు. కాగా, దొంగలు ఇటీవల విడుదలైన ‘ఖాకీ' సినిమాలో దోపిడీలకు పాల్పడే ముఠాను పోలి ఉండటం గమనార్హం. ఈ సినిమాలో కూడా దొంగలు దాదాపు ఇలాంటి దోపిడీ పథకాలనే అమలు చేస్తారు.