మునుగోడుపై చంద్రబాబు కీలక నిర్ణయం- హైదరాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా ఏపీకే టీడీపీ పరిమితం అయింది. తెలంగాణలో పార్టీ ఉన్నా..నామ్ కే వాస్తేగా మిగిలింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలనే నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు చంద్రబాబు కొత్త రాజకీయం మొదలు పెడుతున్నారు. అటు ఏపీలో వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకం కానున్నాయి. అక్కడ ఏపీలో పార్టీకి రూట్ క్లియర్ చేసుకోవాలంటే ముందుగా ఎన్నికలు జరిగే తెలంగాణ నుంచి పావులు కదపాలని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 15వ తేదీన ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

15న జరిగే సమావేశంలో కార్యాచరణ
తెలంగాణ తెలుగుదేశం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలు, నియోజకవర్గాల త్రిసభ్య కమిటీల సభ్యులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల పురోగతితో పాటుగా బీఆర్ఎస్ ప్రకటన ద్వారా మారుతున్న రాజకీయ సమీకరణాలపైనే ప్రధానంగా చర్చ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మునుగోడు నుంచి పోటీ పైన టీడీపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఎటువంటి సన్నద్దత లేకుండా బరిలోకి దిగితే ఎదురయ్యే ఫలితాలు భవిష్యత్ రాజకీయం పైన ప్రభావం చూపుతాయనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. మునుగోడు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న జక్కలి ఐలయ్య యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం సాగింది.

బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ పోరు వేళ
అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేయడంలో భాగంగానే ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 15న జరిగే సమావేశంలో వచ్చే ఎన్నికలకు సంసిద్దత చేసే క్రమంలో భాగంగా వ్యూహాలు సిద్దం చేసుకోనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఇప్పటికే తనను కలిసి తెలంగాణ టీడీపీ నేతలకు క్షేత్ర స్థాయిలో పార్టీ తిరిగి యాక్టివ్ కావాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు కొంత గ్యాప్ వచ్చినా..హైదరాబాద్ తో పాటుగా ఖమ్మం ,నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పార్టీకి ఇంకా సంస్థాగతంగా బలంగానే ఉందని విశ్వసిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ గా మారుతున్న రాజకీయంలో టీడీపీ ఎటువంటి పాత్ర పోషించాలనే దాని పైన చంద్రబాబు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. ఏపీలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యానికి - పొత్తులకు మేలు చేసే విధంగా కార్యాచరణ ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఆచితూచి చంద్రబాబు అడుగులు
అదే సమయంలో తెలంగాణలో తమను రాజకీయంగా దెబ్బ తీసిన టీఆర్ఎస్ ను ఇప్పుడు తాము దెబ్బ తీసే అవకాశం వచ్చిందనేది టీడీపీ నేతల విశ్లేషణ. అందులో భాగంగా.. తెలంగాణ జిల్లాలు, ప్రధానంగా హైదరాబాద్ లోని నియోజకవర్గాల్లో పట్టు నిరూపించకొనేందుకు చంద్రబాబు ఈ నెల 15న జరిగే సమావేశంలో కార్యచరణ ప్రకటిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. టీడీపీ బలపడితే ఆ ప్రభావం బీజేపీ పైన ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో..పరోక్షంగా బీజేపీ పైన ఒత్తిడి పెంచి.. ఏపీలో రాజకీయంగా పై చేయి సాధించే విధంగా చంద్రబాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తానికి ఈ నెల 15న జరిగే సమావేశంలో క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications