తొలిసారి టీకి బాబు: వరంగల్‌వాసి బంగారు అభిమానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో వరంగల్ నగరంలోని ఎల్లమ్మ బజార్‌కు చెందిన యాదగిరి బంగారు నాణేనికి ఒకవైపు చంద్రబాబు చిత్రపటం, మరోవైపు కాకతీయ కళాతోరణాన్ని గీశాడు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఇది గీసినట్లు చెప్పారు.
కాగా, చంద్రబాబు తెలంగాణలో తమ పార్టీకి పునర్వైభవం సాధించేందుకు నడుం బిగించారు. పార్టీని మళ్లీ పట్టాలెక్కించడానికి వరంగల్ జిల్లాలో తొలి అడుగు వేస్తున్నారు. గురువారం హన్మకొండలో జరిగే ప్రతినిధుల సభలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదే ఊపుతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించాలని ఆయన నిశ్చయించారు. ఎన్నికల ముందు ప్రచారం చేసినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆయన ఇంతవరకూ రాష్ట్రంలో పర్యటించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది నెలల సమయం తీసుకొని తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

వరంగల్‌లో జిల్లాస్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం, ఆ తర్వాత విడివిడిగా నియోజకవర్గాల సమీక్షలో పాల్గొంటారు. రాజధాని నుంచి బయలుదేరి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల మీదుగా వరంగల్ వరకు కొనసాగే బాబు పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు భారీ సన్నాహాలు చేశారు.
వరంగల్ సభకు చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టుభవన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లనున్నారు. కార్లు, మోటార్ సైకిళ్లపై కార్యకర్తలు అనుసరిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పార్టీ శాసనసభ్యులు, వారి అనుచరులు ర్యాలీలో ఉంటారు.
చంద్రబాబు నగరంలోని రసూల్‌పురా చౌరస్తాలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. ఉప్పల్ సమీపంలో రంగారెడ్డి జిల్లా కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేదిక నుంచి చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నల్లగొండ జిల్లాలో ప్రవేశించిన అనంతరం భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు. వరంగల్ జిల్లాలో ప్రవేశించగానే పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలకనున్నారు
టీడీపీ ప్రతినిధుల సభకు హన్మకొండ ముస్తాబైంది. హయగ్రీవాచారి గ్రౌండ్‌లో జరిగే ఈ సభకు జిల్లా వ్యాప్తంగా 5వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు హాజరవనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని జెండాలతో పసుపుమయం చేశారు. ప్రాంగణంలో ఐదడుగుల ఎత్తయిన వేదికను ఏర్పాటు చేశారు.
షెడ్యూలు
ఉదయం 11 గంటలకు చంద్రబాబు సభాప్రాంగణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు సభ జరగనుంది. 2.30 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత రాత్రి పొద్దుపోయే దాకా నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి చంద్రబాబు బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.












Click it and Unblock the Notifications