చర్లపల్లి నుంచి మరో వీక్లీ ఎక్స్ ప్రెస్-తెలుగు రాష్ట్రాల మీదుగా ఈశాన్యానికి..!
తెలంగాణ నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ ఈశాన్య భారతానికి చేరుకునే కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు (Charlapalli-Agartala Weekly Express)ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య భారతంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలుకు సంబంధించిన షెడ్యూల్, స్టాప్ లు, బోగీలు, ఇతర వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు.
చర్లపల్లి నుంచి ప్రతీ సోమవారం అగర్తలకు వెళ్లే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17031 జూలై 27న ప్రారంభం కాబోతోంది. అలాగే అగర్తల నుంచి తిరుగు ప్రయాణంలో ప్రతీ శుక్రవారం చర్లపల్లికి మరో వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17032 జూలై 31న ప్రారంభం కానుంది. చర్లపల్లి నుంచి సాయంత్రం 4.20కు బయలుదేరే వీక్లీ ఎక్స్ ప్రెస్ గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి బెంగాల్ మీదుగా త్రిపుర రాజధాని అగర్తలకు గురువారం సాయంత్రం 4.55కు చేరుకుంటుంది. అంటే మూడు రోజుల ప్రయాణం ఉంటుంది.

అలాగే అగర్తలలో శుక్రవారం ఉదయం 5.30కు బయలుదేరే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం 8.40కి చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లలోనూ ఒక సెకండ్ ఏసీ, ఎనిమిది థర్డ్ ఏసీ, ఏడు థర్డ్ ఏసీ (ఎకానమీ), నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ హాల్ట్ లు కలిగి ఉంది. ముఖ్యంగా తెలంగాణలో చర్లపల్లి నుంచి బయలుదేరాక ఒక్క హాల్ట్ కూడా లేదు. ఏపీలో మాత్రం 9 హాల్ట్ లు ఇచ్చారు. దూరప్రాంత రైలు కావడంతో ఇలా పరిమిత స్టాప్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications