ఆగని శిశు విక్రయాలు... 2లక్షలకు పసిబిడ్డ విక్రయం; బయటకు వచ్చిందిలా!!
తెలుగు రాష్ట్రాల్లో శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్న నేటి రోజుల్లోనూ ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నవమాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన అంగన్వాడీ టీచర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శిశువిక్రయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏపీకి చెందిన చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన చిలకమ్మ అనే మహిళ ఓ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి ప్రసవించిన మత్తులో ఉండగానే భరత్ అరుణ్ కుమార్, అత్త ఘంటా మేరీ కలిసి శిశువును రెండు లక్షల రూపాయలకు విక్రయించారు.

విశాఖకు చెందిన వ్యక్తికి శిశువు విక్రయం... శిశు విక్రయ మాఫియా
ఇక ఈ శిశు విక్రయంలో మధ్యవర్తులుగా చింతలపూడి మండలానికి చెందిన ఆర్ఎంపీలు బుచ్చిబాబు, శ్రీనివాస్, అశ్వరావుపేట కు చెందిన ప్రశాంతి అనే మహిళ వ్యవహరించినట్లు గా సమాచారం. కనీసం తల్లి ముఖం కూడా చూడని శిశువును విశాఖకు చెందిన ఓ వ్యక్తికి రెండు లక్షల రూపాయలకు అమ్మేశారు. అయితే చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ సదరు తల్లి చిలకమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు పోషకాహారాన్ని అందించింది.

అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్... పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఆ తర్వాత డెలివరీకి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసుకునే క్రమంలో తల్లి వద్ద బిడ్డ లేకపోవడంతో అనుమానం వచ్చింది. శిశువుని విక్రయించారని అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్ చింతలపూడి శిశుసంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు.దీంతో వారు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఈ వ్యవహారం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అరుణ వెల్లడించారు.

శిశు విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు.. అయినా ఆందోళనకరంగా శిశు విక్రయాలు
ఏది ఏమైనా, శిశువును విక్రయించిన వారి ఆర్థిక పరిస్థితులు ఎలాంటివైనా శిశు విక్రయాలు జరపడం మాత్రం నేరం. గతంలో చాలా వరకు తెలంగాణలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో శిశు విక్రయాలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు అధికారులు చొరవతో, గిరిజనులకు అవగాహన కలిగించడంతో కొంతమేరకు శిశు విక్రయాలు తగ్గినట్టే తెలుస్తున్నా, ఇంకా గుట్టుచప్పుడు కాకుండా శిశు విక్రయాలు జరుపుతున్న ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి అనేది నిర్వివాదాంశం.












Click it and Unblock the Notifications