బోనాల జాతర చెక్కుల పంపిణీ... కుర్చీలు విసిరేసుకున్న టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తలు... తీవ్ర ఉద్రిక్తత...
హైదరాబాద్‌లోని పలు డివిజన్లలో ఆషాఢ బోనాల జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.15కోట్లు నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు డివిజన్లలో బోనాల జాతర నిర్వహణ కోసం అధికారులు చెక్కులు పంపిణీ చేశారు. తాజాగా ముషీరాబాద్ డివిజన్‌లో బోనాల జాతర నిర్వహణ కోసం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. టీఆర్ఎస్,బీజేపీ నాయకుల పోటాపోటీ నినాదాలు,ఘర్షణతో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది.
ముషీరాబాద్ బోలక్‌పూర్ డివిజన్‌లోని దేవుని తోట ప్రాంతంలో ఉన్న శ్రీ భవాని శంకర ఆలయ ప్రాంగణంలో మంగళవారం(జులై 27) అధికారులు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలోని 173 ఆలయాలకు రూ.90లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ ప్రతినిధులకు చెక్కులు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మూడు దేవాలయాల కమిటీ ప్రతినిధులకు చెక్కులు అందజేశారు. అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అనంతరం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ చెక్కుల పంపిణీ చేపట్టారు.ఈ క్రమంలో కొంతమంది బీజేపీ నేతలు వేదిక వద్దకు వచ్చి నిరసన తెలిపారు. బీజేపీ కార్పోరేటర్లకు సమాచారం ఇవ్వకుండా చెక్కుల పంపిణీ చేపట్టడమేంటని ప్రశ్నించారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు బీజేపీ నేతలను అడ్డుకోవడంతో ఇరువరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయగా... బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల ఘర్షణతో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. స్థానిక ఏసీపీ అక్కడికి చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడినుంచి పంపించేశారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ కార్పోరేటర్లకు సమాచారం ఇచ్చామన్నారు. అయినప్పటికీ కార్యక్రమానికి హాజరుకాలేదని... పైగా తమకు ఆహ్వానం లేదని గొడవకు దిగడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications