కొండా సురేఖ.. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి, సీనియర్ల అల్టిమేటం - లేకపోతే ఇక..!!
కొండా సురేఖ వివాదం పార్టీలో తుఫాను గా మారుతోంది. రేవంత్ మద్దతు దారులకు ఇప్పుడు సురేఖ టార్గెట్ అయ్యారు. సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. సురేఖ పార్టీ వీడాలని అల్టిమేటం జారీ చేసారు. లేకపోతే బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ప్రత్యర్థి పార్టీల కోసం రేవంత్ పైన కామెంట్స్ చేయటాన్ని తప్పు బట్టారు. సమస్య ఉంటే పార్టీలో చర్చ చేయాలని.. రేవంత్ పైన విమర్శలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ లో కొండా సురేఖ వివాదం కొత్త మలుపు తీసుకుంది. సీఎం రేవంత్ కు మద్దతుగా పలువురు పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కొండా సురేఖ పార్టీ వీడాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి స్పందిస్తూ.. కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలని డిమాండ్ చేసారు. ఎత్తిన జెండాను దించకుండా పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ అని.. ఆయనపైన విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించాలని డిమాండ్ చేశారు. కష్టపడుతున్న సీఎంపై బండలేస్తారా అంటూ మండిపడ్డారు. కొండా సురేఖ భాష పార్టీని ఇబ్బంది పెడుతోందని.. సమంత విషయంలో కూడా ఇలాగే మాట్లాడారని వీముల వీరేశం పేర్కొన్నారు.

సురేఖ వ్యవహారంలో పార్టీలో ఆగ్రహం
సీఎంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని వేముల వీరేశం హెచ్చరించారు. 'మీ తప్పుడు భాషకు సీఎం మూల్యం చెలించాలా? మీ ఎంటర్టైన్మెంట్ కోసం పార్టీ బలి కావాలా? అధికారంలోకి రావడానికి రేవంత్ చెమట చుక్కలు త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. సీఎం నిర్ణయాలను తప్పు పట్టడం దుర్మార్గం. ఆయన నిర్ణయాలు తప్పు పట్టేవాళ్లు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. సొంత పార్టీ నేతలు ప్రతిపక్షాలకు గొంతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వారిని పక్కన పెట్టాలని డిమాండ్ చేసారు.
పార్టీకి వ్యతిరేకంగా రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడినా, బాలు నాయక్ మాట్లాడినా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి అయిపోయిందని అనుకోవద్దని.. కులం, హోదాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కుట్రను సొంత పార్టీ వాళ్లు అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ను బలహీన పర్చాలని చూస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.













Click it and Unblock the Notifications