సీఎం కేసీఆర్ కీ డెసిషన్స్ - నామినేటెడ్ పోస్టుల ప్రకటన : పార్టీ నేతలతో కీలక సమావేశం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సారిగా నిర్ణయాల్లో స్పీడ్ పెంచారు. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభించారు. ఇప్పటికే పలు పోస్టులు భర్తీ చేయగా..తాజాగా, మరి కొంత మందికి పోస్టులను ఖరారు చేసారు. తాజాగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించారు. బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్ పేరు ఖరారు చేసారు. స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు పేరుకు కేసీఆర్ ఆమోదం తెలిపారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీ
సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్ ను నియమించారు. తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

పార్టీ నేతలతో కీలక సమావేశం
ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రంతో డీ అంటే ఢీ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం సేకరణపై కేంద్రం చేతులెత్తేయడంతో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో కేసీఆర్ చర్చించనున్నట్టు సమాచారం. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ తర్వాత జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ ఎటువంటి పాత్ర పోషించబోతుందన్న అంశంపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు.

భవిష్యత్ కార్యాచరణ ఖరారు
ఇదే సమావేశంలో పార్టీ కమిటీల ఏర్పాటు అంశంపై కూడా కేసీఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కువగా జిల్లాల పర్యటనల ద్వారా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలక మార్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు. తాజాగా కొందరు సీనియర్ మంత్రులతో సీఎం సమావేశమైన సమయంలో పలు అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

పార్టీ - ప్రభుత్వంలో కీలక మార్పుల దిశగా
కేంద్రం తీరుపై తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ సహా వివిధ అంశాలపై సమాలోచనలు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్థిక స్థితిగతులు, అవసరాలు, వివిధ పథకాలు - కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన తీరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. దీంతో..రాజకీయంగా మరింత బలోపేతం అయ్యే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications