coronavirus: మీడియాకు కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు, 31 వరకు బంద్, పెళ్లిళ్లపైనా ఆంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కరోనావైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని అన్నారు. మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశం అనంతరం కేసీఆర్ శనివారం రాత్రి మీడియాకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

కరోనా కట్టడికి రూ. 500 కోట్లు
కరోనా కట్టడికి ఖర్చుకు వెనుకాడేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 500 కోట్లు వెచ్చించాలని కేబినెట్ నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న వారితోనే కరోనా వైరస్ వస్తోంది. ముఖ్యంగా వీరంతా విమానాశ్రయం నుంచి వస్తున్నారు. అందువల్ల శంషాబాద్ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అక్కడే స్క్రీన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో 1020 ఐసోలేషన్ బెడ్స్ అందుబాటులో ఉంచామని సీఎం కేసీఆర్ చెప్పారు. మరో 321 ఐసీయూ బెడ్స్ ఉంచామని, ఇంకో 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచామన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారికే..
రాష్ట్రంలో క్వారంటైన్ ఉంచడానికి నాలుగు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అంతేగాక, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. కరోనావైరస్ భారతదేశంలో పుట్టలేదని.. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపిస్తోందన్నారు. ఒకరు కరోనా వైరస్ వచ్చి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 83 మందికే వచ్చింది. అందులో 66 మంది భారతీయులు కాగా, 17 మంది విదేశీయులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే చనిపోయారు. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేని కేసీఆర్ చెప్పారు.

మార్చి 31 వరకు.. కఠిన చర్యలు తప్పవు
శనివారం రాత్రి నుంచి మార్చి 31 వరకు జనసమ్మర్థ ప్రాంతాలను నియంత్రించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని రకాల విద్యా సంస్థలు పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు ఈ రాత్రి నుంచే మూసివేయాలన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అయితే, పది, ఇంటర్మీడియట్ పరీక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయన్నారు.

పెళ్లిళ్లపైనా ఆంక్షలు..
అంతేగాక, పెళ్లి మండపాలు కూడా మూసివేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. అయితే, ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయమైన పెళ్లిళ్లను అడ్డుకోమని చెప్పారు. అయితే, అతిథులు 200 మందికి మించకుండా వివాహం చేసుకోవాలన్నారు. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. మార్చి 31 తర్వాత మ్యారేజీ హాల్స్ కు కూడా అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు అంతా సహకరించాలన్నారు.

ఇవన్నీ బంద్.. మీడియాకు వార్నింగ్
ఇక బహిరంగ సభలు, వర్క్‌షాపులు, ర్యాలీలు వంటి అనుమతించబోమని, జిమ్ములు, పార్కులు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజియం, అమ్యూజ్ మెంట్ పార్కులు, అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లు మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు మూసివేస్తున్నట్లు తెలిపారు. అయితే, ప్రజల అవసరాల దృష్ట్యా సూపర్ మార్కెట్లు, మాల్స్ తెరిచే ఉంచుతామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో యథాతథంగా నడుస్తాయన్నారు. ప్రజలు వీలైనంత వరకు జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని మీడియాను కూడా సీఎం కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నెలలో వచ్చే పండగలను ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications