టికెట్ నిరాకరించినా.. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కీలక పదవి కట్టబెట్టిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, టికెట్ దక్కని నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు కీలక పదవులను కట్టబెడుతున్నారు. టికెట్ ఇవ్వని కారణంగా.. కీలక నేత పట్నం మహేందర్ రెడ్డికి ఇప్పటికే మంత్రి పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే.
తాజాగా, టికెట్ దక్కని వేములవాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెన్నమనేని రమేష్ బాబుకు సీఎం కేసీఆర్ కీలక పదవిని కట్టబెట్టారు. వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్ బాబుకు బదులు ఆయన స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న చెన్నమనేని రమేష్ బాబుకు రాష్ట్ర వ్యవసాయరంగ సలహాదారుడిగా నామినేటెడ్ పదవి ఇచ్చారు.

అయితే, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ రమేష్ బాబు.. అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో చేసిన పరిశోధన కోసం జర్మనీలోని ప్రతిష్టాత్మక హోంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సీఎం కేసీఆర్ ఈ కీలక పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా రమేష్ బాబుకు అగ్రికల్చర్ ఎకానమి అంశం పట్ల వున్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించనున్నారు.
రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో రమేశ్ బాబు 5 ఏళ్ల కాలం పాటు కొనసాగనున్నారు.
ఇది ఇలావుండగా, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రాజయ్య వంటి వారికి కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్లు దక్కలేదు. దీంతో, వీరు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications