కేసీఆర్ దేశ పర్యటన: వారంరోజులపాటు 8రాష్ట్రాల్లో; కేసీఆర్ జాతీయ మిషన్ ఆంతర్యం ఇదే!!
తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి నుండి దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జాతీయ రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని ప్రకటించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో పట్టుకోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల వ్యూహాలు జాతీయ స్థాయిలో పట్టు కోసం రచిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా దేశ వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

వారం రోజుల పాటు 8 రాష్ట్రాల్లో కేసీఆర్ టూర్
తాజాగా మరోమారు 'జాతీయ మిషన్'కు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి, దేశాభివృద్ధికి కొత్త ఎజెండాను రూపొందించే ప్రయత్నాల్లో భాగంగా దేశంలోని వివిధ రంగాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలను కలుసుకోవడానికి వారం రోజుల పర్యటనను నేటి నుండి ప్రారంభిస్తున్నారు. దేశానికి సరికొత్త దశ, దిశ చూపించడం కోసం టిఆర్ఎస్ ప్రత్యామ్నాయ అజెండా తీసుకువచ్చే విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న దేశవ్యాప్త పర్యటన లో తొలిదశలో వారం రోజుల పాటు మొత్తం 8 రాష్ట్రాలు ప్రభావితమయ్యేలా కార్యక్రమాలు రూపొందించారు.

ఢిల్లీకి నేడు కేసీఆర్ .. రాజకీయ నేతలు, ఆర్ధిక వేత్తలు, పాత్రికేయులతో సమావేశాలు
ఈ పర్యటనలో రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులను ఆయన కలుస్తారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలను, దేశంలో రైతు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ పరామర్శించనున్నారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడ రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు, పాత్రికేయులతో సమావేశమవుతారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ, మతపరమైన, ఆర్థిక పరిస్థితులపై ఆయన చర్చిస్తారని భావిస్తున్నారు.

చండీగఢ్‌లో కేసీఆర్ పర్యటన .. రైతు కుటుంబాలకు ఓదార్పు, చెక్కుల పంపిణీ
మే 22న, ఆయన చండీగఢ్‌లో పర్యటించనున్నారు, అక్కడ కేంద్రం ప్రతిపాదించిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీకి చెందిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను ఓదార్చనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లతో కలిసి ఆయన ఒక్కొక్కరికి రూ.3 లక్షల చెక్కులను పంపిణీ చేయనున్నారు.

హెచ్‌డి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, అన్నా హజారే లతో భేటీ
మే 26న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లనున్న కేసీఆర్ బెంగుళూరులో అక్కడ మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామితో చర్చలు జరపనున్నారు. దేశ రాజకీయాలలో మార్పు కోసం ఆయన ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన నేతలతో మంతనాలు జరపనున్నారు. ఈ క్రమంలోనే దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామితో చర్చలు జరపనున్నారు. మరుసటి రోజు, మే 27వ తేదీన ఆయన మహారాష్ట్రలోని రాలేగాన్ సిద్ధికి వెళ్లి అక్కడ సామాజిక కార్యకర్త అన్నా హజారేతో సమావేశం కానున్నారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం షిర్డీకి వెళ్తారు.

మే 28న హైదరాబాద్‌కు .. మళ్ళీ పశ్చిమ బెంగాల్ మరియు బీహార్‌లకు పయనం
ముఖ్యమంత్రి మే 28న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. మే 29 లేదా 30న పశ్చిమ బెంగాల్ మరియు బీహార్‌లలో తన రెండవ టూర్ షెడ్యూల్ ప్రారంభించి, అక్కడ గాల్వాన్ లోయలో ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్ల కుటుంబాలను కలుసుకుంటారు. సరిహద్దులను రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలను పరామర్శించనున్న సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించిన విధంగా ఆర్థిక సాయం అందించనున్నారు. మొత్తానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం సాగిస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ మిషన్ మొదలుపెట్టారు.