హత్యకు గురైన శ్రీనివాసరావు భార్యకు డిప్యూటీ ఎమ్మార్వో జాబ్ నియామక పత్రం అందించిన కేసీఆర్
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(FRO) శ్రీనివాసరావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. శ్రీనివాసరావును గత ఏడాది నవంబర్ నెలలో గుత్తికోయలు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబానికి ఇప్పటికే ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం.. తాజాగా ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు భార్య భాగ్యలక్ష్మికి సీఎం కేసీఆర్ ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఆమెకు డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కల్పించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్టు డిపార్ట్‌మెంట్ వారు చాలా కష్టపడి మన కోసం అడవులను పెంచుతున్నారని కేసీఆర్ తెలిపారు. కానీ దుర్మార్గులు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపేశారు. ఆ ఫారెస్టు అధికారి భార్యకు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం కల్పించి, నియామక పత్రాన్ని అందజేశామని తెలిపారు. కొంత డబ్బులు కూడా అందజేశామని తెలిపారు.
మనిషిని అయితే తేలేం కానీ.. వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు హామీ ఇస్తున్నాను. మీ(అటవీ అధికారులు) మీద దాడులు జరగకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ల మాదిరిగా ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఒక 20 వరకు స్టేషన్లు అవసరం అవుతాయన్నారు. వాటిని వెంటనే మంజూరు చేద్దామన్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పటిష్టం చేద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
మరోవైపు, పెద్ద దిక్కును కోల్పోయిన తమ కుటుంబానికి పెద్దగా.. తండ్రిలాగా సీఎం కేసీఆర్ అండగా నిలిచారంటూ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికే ఇంటి స్థలం, ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications