ఏపీ భవన్ స్థలంపై కన్నేసిన కేసీఆర్: హోంమంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు లేఖ రాశారు. పూర్వపు హైదరాబాద్ స్థలం మొత్తాన్ని తెలంగాణకే కేటాయించాలని ఆయన కోరారు.
పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థలాన్ని తెలంగాణకే కేటాయించాలని సీఎం కోరారు. భారత విదేశీ వ్యవహారాలశాఖ రికార్డుల ప్రకారం 1917, 1928, 1936 సంవత్సరాల్లో 18.18 ఎకరాల స్థలాన్ని నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ స్థలంలోనే ప్రస్థుత హైదరాబాద్ హౌస్, తెలంగాణభవన్‌లు ఉన్నాయన్నారు. అందుకు బదులుగా పటౌడీ హౌస్‌లో 7.56 ఎకరాలు, నర్సింగ్ ఇన్సిస్టీట్యూట్‌లో1.21 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో భారత ప్రభుత్వం హైదరాబాద్ హౌస్‌ను స్వాధీనం చేసుకుంది.

తిరిగి ఆ స్థలంలో తెలంగాణ వాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ భవన్ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో 10వ షెడ్యూల్‌లోని సంస్ధలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు మద్దతుగా కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. గతంలో మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన సందర్భంగా అవలంభించిన విధానాలనే అనుసరించాలని లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications