ఆయుత చండీయాగం అంటే?: '200 ఏళ్ల చరిత్రలో ఎవరూ చేయలేదు'
హైదరాబాద్: గత 200 ఏళ్ల చరిత్రలో ఎవరూ ఆయుత చండీయాగం నిర్వహించిన దాఖలాలు లేవని శృంగేరి పీఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరీ శంకర్ తెలిపారు. శృంగేరి పీఠం నుంచి ప్రత్యేక దూతగా ఆయన ఎర్రవెల్లిలో చండీయాగం జరుగుతున్న యాగస్థలికి ఆయన విచ్చేశారు.
చండీయాగం నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆశీస్సులు అందజేసిన సందేశాన్ని యాగస్థలిలో గౌరీ శంకర్ చదివి వినిపించారు. ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న యాగం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు.
ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తరహాలో ఈ యాగానికి ఏర్పాట్లు చేశారని గౌరీశంకర్ అన్నారు. రుత్విజులతో యాగశాల మినీ ఇండియాను తలపిస్తోందని చెప్పారు. అంతకముందు చండీయాగంలో పాల్గొనేందుకు వచ్చిన రామోజీరావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్‌లకు సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికి యాగస్థలికి తీసుకెళ్లారు.

చండీయాగాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయం గురు ప్రార్థనతో చండీయాగం ప్రారంభమైంది.
ఆయుత చండీయాగం అంటే?:
అయుతం అంటే పదివేలు. పదివేల సంఖ్యను పూరిస్తూ చండీ (దుర్గ) సప్తశతీ పారాయణాలను పూర్తి చేసి, ఆ సంఖ్యలోని దశాంశంతో అంటే వేయిసార్లు నామాలతో హోమం చేసి, పూర్ణాహుతులను సమర్పించడమే అయుత చండీయాగం. ఆధ్యాత్మిక సంపన్నుల భాష్యమేమిటంటే కలియుగంలో నామజపానికీ, యాగానికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అంతేగాక కలౌచండీ వినాయకౌ అన్న సూక్తి మేరకు చండీ ఉపాసనకూ అమిత ప్రాధాన్యం ఉంటుంది.
నిజానికి శక్తిరూపిణి అయిన చండిక ఉగ్రరూపిణి. ఆ ఉగ్రత్వం ఎందుకనేదీ ప్రస్తావనాంశమే. చండికలోని ఉగ్రత్వం శత్రుసంహారకం, దుష్టసంహారకం. అంటే ధర్మవర్తనులను పీడించే అన్ని రుగ్మతలపైనే ఆ ఉగ్రత్వం, వెరసి సమాజ కళ్యాణానికి ఆ ఉగ్రత్వం ఉపయోగకరం. ఆమెను ప్రసన్నం చేసుకునే సర్వోత్కృష్ణ ప్రయత్నమే అయుత చండీయాగం.

అయుత చండీయాగంతోపాటు మహారుద్రయాగం, కుమారస్వామి, గణపతి, రుద్రహోమాలు, చతుర్వేద హవనం, పారాయణాలు, జపాలు జరుగుతాయి. 106 హోమగుండాలతో 1500 మంది రుత్విక్కులు, 5 రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీ నవాక్షరి జపాలను చేస్తారు. ఒక్కో రుత్విక్కుడు తొలిరోజు ఒక సప్తశతి పారాయణం, నాలుగు వేల చండీ నవాక్షరీ జపం చేస్తారు. రెండోరోజు రెండు వేల పారాయణాలు, మూడువేల జపాలు చేస్తారు.
మూడోరోజు మూడు వేల పారాయణాలు, రెండు వేల జపాలు చేస్తారు. నాలుగోరోజు నాలుగు సప్తశతి పారాయణాలు, వేయి చండీ నవాక్షరీ జపం చేస్తారు. చివరిరోజున ఒక్కో హోమగుండం వద్ద 11 మంది రుత్విక్కులు పాయసంతో హోమం చేస్తారు. 100 మంది పాలతో 10 వేల పారాయణాలకు దశాంశం వేయిసార్లు తర్పణలిస్తారు.
అనంతరం మహాపూర్ణాహుతి అయుత చండీయాగం సంపూర్ణమవుతుంది. వీటితోపాటు రోజూ నవదుర్గలకు నవావరణ పూజ, బలిప్రదానం, సువాసినీపూజలు, కన్యకాపూజలు, మహిళలతో కుంకుమార్చనలు, సాయంకాలం ప్రదోషకాలంలో అవధారయలు, రాజోపచారాలు, శాస్ర్తాలు, ప్రవచనాలు, మంగళ నీరాజన మంత్రపుష్పాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications