మూడోరోజుకు అయుత చండీయాగం: పాల్గొన్న మహారాష్ట్ర గవర్నర్, ఏపీ స్పీకర్
హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన అయుత మహా చండీయాగం మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం గురుప్రార్ధనతో మూడోరోజు అయుత చండీ యాగం ప్రారంభమైంది. వేద మంత్రాల మధ్య శ్వేత వర్ణ దుస్తుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగస్థలికి చేరుకున్నారు.
శుక్రవారం అయుత చండీయాగానికి ఆధ్మాతిక వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మూడోరోజు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ సతీసమేతంగా యాగంలో పాల్గొన్నారు. గవర్నర్ దంపతులకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు.

చినజీయర్‌స్వామి, పరిపూర్ణానందస్వామి, ఈనాడు ఎండీ కిరణ్ దంపతులు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పారిశ్రామికవేత్త సుందరనాయుడు తదితరులు యాగంలో పాల్గొన్నారు. ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుతో పాటు మండలి ఛైర్మన్ చక్రపాణి యాగాశాలకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు.
అంతక ముందు మాజీ డీజీపీ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పేర్వారం రాములు యాగానికి వచ్చారు. సంప్రదాయం ప్రకారం ఈరోజు రుత్విజులు, యాగకర్తలు, నిర్వాహకులు శ్వేతవర్ణం దస్తులు ధరించారు. మంత్రి హరీశ్‌రావు యాగప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీచక్రం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాగంలో భాగంగా ఈరోజు గణపతిపూజ, ఏకదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీపారాయణాలు, నవావరణ పూజ, నవగహ్ర హోమం, యోగిని బలి, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పురశ్చరణలు, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

గురు ప్రార్థనతో ప్రారంభమైన చండీయాగం, గోపూజ, త్రిసహస్ర చండీ పారాయణములు, నవార్ణ పూజ, నవగ్రహ హోమం, తదితరాలతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అన్నమయ్య భావనా వాహిణి వ్యవస్థాపకురాలు శోభారాజ్ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు.
ఈరోజు రాత్రి 10 గంటల వరకూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. భక్తులు ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకూ యాగశాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ చండీయాగానికి వీఐపీల నుంచి సామాన్య ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్ పూర్, గజ్వేల్ మండలాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి ప్రజలు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారితో పాటు జగదేవ్ పూర్ నల్లగొండ ప్రధాన మార్గం ట్రాఫిక్ జామ్ అయింది.
తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వందలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఎర్రవల్లికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఎర్రవల్లిలో ట్రాఫిక్ నియంత్రణపై మంత్రి హరీష్‌రావు సమీక్షించారు.












Click it and Unblock the Notifications