సెంటిమెంట్ కలిసివచ్చేనా - కేసీఆర్ "హ్యాట్రిక్" కోసం..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలు రేసులో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఎన్నికల సమరం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలోనే మకాం వేసారు. ఇక..కేసీఆర్ ఏ కార్యక్రమం తల పెట్టినా నిర్వహించే రాజశ్యామల యాగం మూడు రోజుల పాటు గజ్వేల్ లోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్నారు.
రాజశ్యామల యాగం: సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని అధికారులు నిర్వహించనున్నారు. విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగం ఐదు రోజుల పాటు జరగనుంది. 200 మంది వైదికులతో యాగం నిర్వహించనున్నారు.

రాజశ్యామలా అమ్మవారు, చండీ అమ్మవార్లతోపాటు ఐదుగురిని ఆవాహనం చేసుకొని హోమం నిర్వహించనున్నారు. ఈ రోజు సంకల్పంతో యాగం ప్రారంభం కానుంది. రెండో రోజు వేద పారాయణాలు , హోమం చివరి రోజు పుర్ణావుతితో యాగం ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల, శత చండీ యాగాలను నిర్వహించనున్నారు.
కేసీఆర్ సెంటిమెంట్: అధికారం రావడానికి, శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం ఈ యాగం చేస్తారని పండితులు చెబుతున్నారు. తొమ్మిది హోమ కుండాలు, వంద మంది రుత్వికులతో రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజున సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ చేసి యాగ ప్రవేశం చేస్తారు. రుత్వికులు పారాయణం, జపాలు, హోమాలు నిర్వహిస్తారు. మూడో రోజున పూర్ణాహుతి కార్యక్రమాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
అలాగే, శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో బుధవారం నుంచే వ్యవసాయ క్షేత్రంలో శత చండీ యాగం నిర్వహించనున్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఈ యాగం చేసిన కేసీఆర్ అధికారం నిలబెట్టుకున్నారు. ఏపీలోనూ 2019 ఎన్నికల సమయంలో జగన్ ఈ యాగం నిర్వహించారు. అధికారం దక్కించుకున్నారు.

విజయం పై ధీమా: విజయం ఆకాంక్షిస్తూ చేసే ఈ యాగం ఇద్దరు సీఎంలకు సెంటిమెంట్ గా మారింది. ఇప్పుడు ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనేది కేసీఆర్ లక్ష్యం. మొదటి రెండు రోజులు వందమంది రుత్వికులచే పారాయ ణం నిర్వహిస్తారు. మూడో రోజు శుక్రవారం పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ మేరకు రెండు యాగాల నిర్వహణకు సీఎం వ్యవసాయ క్షేత్రంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు.
యాగశాల, హోమ కుండాలను నిర్మించారు. హోమాల నిర్వహణ కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 200 మంది రుత్వికులు చేరుకున్నారు. ఇప్పటికే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం కేసీఆర్ ఈ యాగం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications