ప్రాణ నష్టం జరగొద్దు, సరిపడా బొగ్గు నిల్వ చేయండి: భారీ వర్షాలపై కేసీఆర్ రివ్యూ, కీలక ఆదేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో, తక్షణ రక్షణ చర్యలను కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
వరదల నేపథ్యంలో రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం బుధవారం కూడా ప్రగతి భవన్‌లో వానలు వరదల పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో సీఎం దాదాపు 6 గంటలపాటు వరదలు, రక్షణ చర్యల పై పరిస్థితిని సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ వంటి పలు రిజర్వాయర్ల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి ఆరాతీస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు సీఎం తగు ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టవలసిన ముందస్తు చర్యలకు ఫోన్లో ఆదేశాలిచ్చారు సీఎం. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలను సీఎం ఆరా తీశారు.

కడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల తరలింపు:
కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్నందున కడెం ప్రాజెక్టు దిగువకు నీటిని విడుదల చేస్తున్నకారణంగా ముంపునకు గురవుతున్న 12 గ్రామాల ప్రజలు అధికారులు ఖాళీ చేయించారు. అక్కడే వుండి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఫోన్లో సీఎం ఆదేశించారు. నిర్మల్ సహా వరద ముంపుకు గురౌతున్న నదీ పరివాహక ప్రాంత పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్ ను సీఎం ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలన్నింటి గురించి సీఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లకు సీఎం ఆదేశాలిచ్చారు.

భధ్రాచలం లో రక్షణ చర్యలు చేపట్టండి:
భద్రాచలం లో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అక్కడే వుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సీఎం ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని, చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తో సీఎం సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.

విద్యుత్తు సరఫరాకు ఆటంకాలు లేకుండా బొగ్గు నిల్వలు
రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీ లు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సిఎండీ శ్రీధర్ లను సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు 2300 వరకు విద్యుత్తు స్థంభాలు కూలిపోతే 1600 వరకు పునరుద్దరణ చేపట్టామని, మిగతా పునరుద్దరణ పనులు పురోగతిలో ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు సీఎం కు వివరించారు. విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాలద్వారా విద్యుత్తును పునురుద్ధరిస్తున్నట్టు సిఎండీలు ప్రభాకర్ రావు రఘురామారెడ్డి లు సీఎం కు వివరించారు.

హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలె:
ప్రాజెక్టులకు విపరీతంగా వరద చేరుకుంటున్న నేపథ్యంలో, అవకాశమున్న చోటల్లా హైడల్ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించాలని సీఎం అన్నారు. వరదల వల్ల పురోగతిలో వున్న దేవాదుల ప్రాజెక్టుల పనులకు అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి తలెత్తిందని అధికారులు సీఎం కు వివరించారు. వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు.

నిధులు విడుదల చేయాలి:
వానలు, వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎస్, డిజిపిలను సీఎం ఆదేశించారు. వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే బయటకు వెళ్ళవద్దని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు:
సమీక్షా సమావేశం నుంచే వరద ముంపు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను ఫోన్లో అడిగి తెలుసుకుని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితులు చక్కబడేవరకు వారి వారి నియోజకవర్గాలు, జిల్లాలు విడిచి వెళ్ళరాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఈఎన్ సి మురళీధర్, విద్యుత్తు, ఆర్ అండ్ బి, జిహెచ్ ఎంసి, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సెలవులు పొడిగింపు:
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయం మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications