సీఎం కేసీఆర్ సంచలనం: త్వరలో తెలంగాణా జిల్లాల పర్యటన, హుజురాబాద్ దెబ్బతో దిద్దు'బాట'లో గులాబీ బాస్!!
గులాబీ బాస్ కేసీఆర్ పంధా మార్చుకుంటున్నారా? ఎవరేం అన్నా పట్టించుకోని తెలంగాణా సీఎం హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు ప్రతిపక్షాల విమర్శలపై ఆలోచనలో పడ్డారా? హుజురాబాద్ ఉప ఎన్నిక ఇచ్చిన షాక్ భవిష్యత్ లో కేసీఆర్ తాయిలాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి మంత్రాలు పని చెయ్యవన్న భావన కలిగించాయా? అందుకే కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

హుజురాబాద్ దెబ్బకు దిద్దుబాట పట్టిన కేసీఆర్ ..
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఇచ్చిన షాక్ తో సీఎం కేసీఆర్ దిద్దుబాటు బాట పట్టారని తెలుస్తుంది. గులాబీ బాస్ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలిచే పార్టీ లేదని నిన్నమొన్నటిదాకా ధీమా వ్యక్తం చేస్తే తాజా పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రాభవం తగ్గింది అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాలని శతవిధాలా ప్రయత్నం చేసినా ఓటమి పాలు కావటం గులాబీ బాస్ కు డైజెస్ట్ కావటం లేదు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అటు పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటుగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.

ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా ప్రజా క్షేత్రంలోకి సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో, సంక్షేమ పథకాలతో ప్రజలతో మమేకం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాక్షేత్రంలోకి వస్తారని, ఎన్నికల సమయంలోనే తాయిలాలను ప్రకటిస్తారని, సంక్షేమ పథకాలను తీసుకువస్తారని, అభివృద్ధి మంత్రాన్ని జపిస్తారు అని ప్రతిపక్ష పార్టీల నేతలు పదేపదే టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయమంతా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లోనో, ఫాంహౌస్ లోనో రెస్ట్ తీసుకుంటాడని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టార్గెట్ చేస్తూనే ఉన్నాయి.

రాష్ట్రంలో అన్ని జిల్లాల పర్యటన చెయ్యనున్న సీఎం కేసీఆర్
ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకుడిగా సీఎం కేసీఆర్ ను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలకు చెక్ పెట్టడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. ప్రతిపక్షాల నోటికి తాళం పడేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు సమాచారం.
అధికారిక కార్యక్రమాలతో పాటుగా, పార్టీకి సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ తన పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. దీనికోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

పార్టీ బలోపేతంపై, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లటంపై ఫోకస్
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లడం, ప్రజలలో టిఆర్ఎస్ పార్టీ పట్ల వున్న వ్యతిరేకతను తగ్గించటం, ఇదే సమయంలో పార్టీని పటిష్ఠంగా నిర్మించడం కోసం కెసిఆర్ జిల్లాల పర్యటన సాగనుంది. నవంబర్ 29 వ తేదీన వరంగల్ లో టిఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ నిర్వహించనున్న క్రమంలో,ఈ సభ కంటే ముందే సీఎం కేసీఆర్ 1,2 జిల్లాలలో పర్యటించనున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఇక విజయ గర్జన సభ తర్వాత మిగతా జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

భవిష్యత్ ఎన్నికల టార్గెట్ .. కేసీఆర్ జిల్లాల పర్యటన
ప్రజాక్షేత్రంలోకి వెళితేనే ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది?టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలి? ప్రతిపక్షాల బలం ఏంటి? నిత్యం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏ విధంగా చెక్ పెట్టాలి? పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? వంటి అనేక అంశాలపై దృష్టి సారిస్తున్న కెసిఆర్ ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ ఎన్నికలను ఉద్దేశించే అన్న చర్చ జరుగుతుంది . మరి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం టిఆర్ఎస్ పార్టీకి ఎంత మేరకు లాభిస్తుందనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications