ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారు: సీఎం కేసీఆర్
ఎన్నికల ప్రచారం చివరి రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ వరంగల్ తూర్పు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్ వేదికగా నిలిచిందని ఆ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ ఇక్కడే నిర్వహించామని బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలిపారు.
వరంగల్ ఈస్ట్, వరంగల్ ఈ వెస్ట్ నియోజకవర్గాల, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సేనని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని వరంగల్ ప్రజలకు కేసీఆర్ సూచించారు.

24 గంటల ఉచిత కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలోనే వరంగల్ టెక్స్టైల్ పార్కులో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలలో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ నగరం వరంగల్ అని, మళ్లీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు.
24 అంతస్తుల కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి హైదరాబాద్లో కూడా లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆటో రిక్షాల కార్మికులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పర్మిట్ టాక్స్ ను రద్దు చేస్తామని కెసిఆర్ వెల్లడించారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడం కోసమే బి ఆర్ ఎస్ పార్టీ పుట్టిందని పేర్కొన్న కెసిఆర్, తెలంగాణ ఇంటి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఎన్నికల తర్వాత పింఛన్లు ఐదువేల రూపాయలకు పెంచుతున్నట్టు కెసిఆర్ వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అని, ఆ సమయంలో అన్నీ ఎన్కౌంటర్ లేనని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ను బొంద పెట్టాలని, బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications