తెలంగాణ గిరిజనులకు గుడ్‌న్యూస్: ఆ రోజు నుంచే పోడు పట్టాల పంపిణీ
హైదరాబాద్: గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్రంలో గిరిజనులకు జూన్ 30 నుంచి పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో సీఎం కేసీఆర్ పాల్గొని.. శ్రీకారం చుట్టనున్నారు
మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. జూన్ 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ అనివార్య కారణాలతో ప్రభుత్వం ఈ నెల 30వ వాయిదా వేసింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం, పర్యటనలో భాగంగా రెండురోజులుగా జిల్లా కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహిస్తోంది.

అంతేగాక, జూన్ 29న బక్రీద్ పండుగ కూడా ఉండటం.. వీటన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30కి వాయిదా వేయాలని నిర్ణయించింది. ఆసిఫాబాద్ పర్యటన సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ కలెక్టరేట్, జిల్లా పోలీసుల ప్రధాన కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
కాగా, జూన్ 26 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. కాగా, వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.
ఈ రైతు బంధు పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) 2018, మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్ పాసు పుస్తకాలు అందుకున్నారు.












Click it and Unblock the Notifications