మంత్రి పదవులు రాని సీనియర్లకు బుజ్జగింపులు, కీలక పదవులు - ఎవరికి ఏంటి..!!
అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవి కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న పార్టీ సీనియర్లకు ఏఐసీసీ బుజ్జగింపులు మొదలు పెట్టింది. అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకొని తమకు అవకాశం ఇవ్వకపోవటం పైన సీనియర్లు కినుక వహించారు. దీంతో.. వారికి ప్రభుత్వంలో కీలక పదవులు కేటాయించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అయితే, రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు.
అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో సీనియర్లు కొందరు కినుక వహించారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నా.. తమకు అవకాశం ఇవ్వకపోవటం పైన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో.. వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ కొత్త ఫార్ములా అమలు చేసింది. తొలి నుంచి మంత్రివర్గ రేసులో ఉన్న మాజీ మంత్రి.. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి కీలక పదవి ప్రకటించారు. కేబినెట్ ఎప్పుడు విస్తరించినా తనకు మంత్రి పదవి ఖాయమని సుదర్శన్ రెడ్డి భావించారు. కాగా, సామాజిక సమీకరణాల్లో ఆయనకు ఇప్పట్లో మంత్రి పదవి లేదని తేలిపోయింది. దీంతో.. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలను సుదర్శన్ రెడ్డికి అప్పగించారు.

అదే విధంగా ఉమ్మడి అదిలాబాద్ కు చెందిన మరో సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు చాలా కాలం గా మంత్రి పదవి కోసం వేచి ఉన్నారు. అదే జిల్లాకు చెందిన వివేక్ కు మంత్రి పదవి దక్కింది. దీంతో, ఇప్పుడు మరోసారి విస్తరణ సమయంలో మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలో ప్రేమ్ సాగర్ రావు నేరుగా సోనియాను కలిసారు. అయితే.. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి లేకపోవటంతో... పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ పదవి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. ఇప్పుడు మంత్రి పదవి రాని వారికి పదవులు కేటాయించగా.. రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. ఇప్పుడు ఈ ఇద్దరికీ పదవులు ఇవ్వటంతో.. మంత్రివర్గంలో బెర్తు ఆశిస్తున్న మిగిలిన వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications