నీట్ పరీక్ష రద్దుపై పారదర్శక విచారణ జరగాల్సిందే..!!
నీట్ యూజీ పరీక్ష లీక్.. రద్దు వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్ధుల భవిష్యత్ తో ఆడుకోవటం పైన అన్ని పక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశం పైన సీఎం రేవంత్ స్పందించారు. ఈ లీక్ వ్యవహారం పైన కేంద్ర దర్యాప్తు సంస్థలతో పార దర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.
అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశం కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించే నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేయాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకుని, జాతీయ పరీక్షా విధానం ఆధారపడిన నమ్మకానికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA వెల్లడించింది. పత్రాల లీకేజీ ఆరోపణలపై సమగ్ర విచారణ కోసం ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో విచారణ మొదలైంది. బాధ్యులను గుర్తించి.. ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా.. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. పరీక్ష రద్దుతో లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్ష నిర్వహణ వైఫల్యం పై రేవంత్ ఆగ్రహం
ఈ ఘటనతో దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును పేపర్ లీక్ ఘటనలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో పరీక్షల విశ్వసనీయతను కేంద్రం కాపాడాలని రేవంత్ రెడ్డి కోరారు. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మళ్లీ ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, నీట్ అక్రమాలపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని కోరారు. పోటీ పరీక్షలు అవకాశాల వేదికగా ఉండాలే తప్ప విద్యార్థుల జీవితాలను నాశనం చేసేలా మారకూడదని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీక్ వంటి వాటిల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య పోలిక ఉందంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.













Click it and Unblock the Notifications