కేసీఆర్ కు రేవంత్ ఓపెన్ ఆఫర్ - ఇలా చేస్తే, మూడేళ్లు మీకే అప్పగిస్తాం..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహం మార్చారు. తన పార్టీ నేతలను అప్రమత్తం చేస్తూనే... ప్రత్యర్థి పార్టీల పై గురి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైనా బీఆర్ఎస్ నేతలను మరోసారి టార్గెట్ చేసారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా సీఎం రేవంత్ ఇదే అంశం పై మాజీ సీఎం కేసీఆర్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టు పైన కన్వీన్స్ చేస్తూ మూడేళ్లు బ్యారేజ్ లు అప్పగిస్తానని ప్రకటించారు. దీంతో, ఇప్పుడు కేసీఆర్ స్పందన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
బీఆర్ఎస్ నేతల పైన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హాయంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తికావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1.21 లక్షల కోట్లకు చేర్చారని విమర్శించారు. రూ.1.02 లక్షల కోట్ల చెల్లింపులు చేసిన తర్వాత ప్రారంభించిన మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందని చెప్పుకొచ్చారు.

కాళేశ్వరంపై చర్చ పెట్టాలని కోరుతూ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తనకు ఎందుకు బ్యారేజీలు అప్పగించాలో కేసీఆర్ సభకు చెప్పి మెప్పించగలిగితే 3 బ్యారేజీలను ఆయనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వారం రోజులు కాదు, మూడేళ్లు అప్పగిస్తామని, ఎల్ అండ్ టీతో పాటు ఇతర కాంట్రాక్టర్లను తొలగించి, మేజర్ కాంట్రాక్టర్ కింద కేసీఆర్‌కు బ్యారేజీలు అప్పగిస్తామని ప్రకటించారు.
కేసీఆర్ స్పందిస్తారా..
కాంట్రాక్టర్లను 60సీ కింద టర్మినేట్ చేసి బ్యారేజీలు అప్పగిస్తామని, కేసీఆర్ తనకు కావాల్సిన వాళ్లందర్నీ పెట్టుకొని పని చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ వాదనలో బలం ఉంటే, ఏ తప్పుకు పాల్పడకపోతే సభకు రావాలన్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు. సాగునీటి నిపుణులను, అడ్వకేట్ జనరల్‌ను సభలోకి పిలిచి మరీ చర్చ పెడదామన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు వినియోగిస్తున్నామని. సచివాలయాన్ని కూడా వాడుకుంటున్నామని, ఆయన పథకాలన్నీ కొనసాగిస్తున్నామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ వెన్నుపూసలాంటిదని ముఖ్యమంత్రి చెప్పారు.
అందులో నాలుగు పూసలు ఊడితే చేయడానికి ఏమీ ఉండదని అన్నారు. కాళేశ్వరం బ్యారేజీలో నీళ్లు నింపే అవకాశాల్లేవని చెప్పారు. కేసీఆర్ కాళేశ్వరం కోసం రూ.97 వేల కోట్ల రుణం తెస్తే రూ.33 వేల కోట్లను ఏడాది వాయిదాల కింద చెల్లించామని సీఎం రేవంత్ చెప్పారు. కాగా.. రాష్ట్రంలో ఇప్పుడు కాళేశ్వరం పైన చర్చ జరుగుతున్న రేవంత్ చేసిన తాజా ఆఫర్ కు కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications