సొంత చెల్లినే గెంటేసిన మీరు మహిళా సంక్షేమం చేస్తారా? కేటీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్!
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని హకీంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో మహిళలకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేశారు.
పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని సీఎం ఘాటుగా విమర్శించారు. కేటీఆర్ సొంత చెల్లి విషయంలో కూడా తీవ్రంగా మాట్లాడారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. సాధారణంగా అన్న చెల్లిని క్షమించి అక్కున చేర్చుకుంటాడు. కానీ కేటీఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన చెల్లిని కూడా బయటకు పంపించేశారని సీఎం అన్నారు.

ఇలాంటి వైఖరి ఉన్నవారు మహిళల సంక్షేమం గురించి మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారు.మహిళల అసలైన అభ్యున్నతి పిల్లల చదువు, వారి ఎదుగుదలలోనే ఉందని సీఎం అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో మహిళలను భాగస్వాములుగా చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా మహిళల పేరిటే ఇస్తున్నామని గుర్తు చేశారు. ఉచిత సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కరెంట్ బిల్లు ఉపశమనం వంటి పథకాల ద్వారా కుటుంబాల ఆర్థిక భారం తగ్గిస్తున్నామని వివరించారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారని కూడా ప్రస్తావించారు.70 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని పథకాలను తీసుకొచ్చామని సీఎం చెప్పారు. వెయ్యి ఆర్టీసీ బస్సులను మహిళలకు యజమానులుగా చేశామని, హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి స్టాళ్లు, క్యాంటీన్లు కేటాయించామని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 70 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, 2034 నాటికి ఈ సంఖ్యను కోటికి చేర్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.మహిళా సంఘాలకు 34 నెలల్లో రూ.79 వేల కోట్ల బ్యాంకు రుణాలు అందించామని, రూ.1,900 కోట్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందని సీఎం తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు అందించామని కూడా చెప్పారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేసినవి కావడం విశేషం.తన పుట్టినరోజు దీపావళి పండుగతో కలిసి వచ్చిన సందర్భంగా మహిళల మధ్య జరుపుకోవడం తనకు చాలా సంతోషం కలిగించిందని సీఎం అన్నారు.
"మీరే నా కుటుంబం, మీరే నా ఆత్మబంధువులు. మీ ఆశీర్వాదంతోనే ఈ బాధ్యత చేపట్టాను. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా మార్చగలిగితే నా జన్మ ధన్యమైనట్టే" అని భావోద్వేగంతో మాట్లాడారు. మహిళలు తమ కుమార్తెలను తప్పనిసరిగా ఉన్నత విద్య అభ్యసింపజేయాలని, ఆడపిల్ల చదువుకుంటేనే కుటుంబం, సమాజం ముందుకు వెళ్తాయని సూచించారు.













Click it and Unblock the Notifications
