CM Revanth Reddy: అసెంబ్లీ రా.. లెక్కలనీ తేలుస్తా.. కేసీఆర్ కు రేవంత్ సవాల్
CM Revanth Reddy: ఏడు లక్షల అప్పుల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించారని.. రైతుబంధు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గతంలో ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతుబంధు వేయలేదని.. తాము అధికారంలోకి రాగానే బకాయి రైతుబంధు వేశామన్నారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ అసలు అలాగే ఉందని.. మిత్తి చెల్లించినట్లు అయిందన్నారు. నాలుగు విడతలు చెల్లిస్తామంటూ నట్టేట ముంచాడని విమర్శలు గుప్పించారు.
ఫామ్ హౌస్ లో ఉండి కబుర్లు చెప్పడం కాదని.. అసెంబ్లీకి రా మాట్లాడదామంటూ రేవంత్ అన్నారు. అసెంబ్లీకి రా.. ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశామో లెక్కలు చెప్తామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వేస్తున్నామని.. జనవరి 26న రైతుభరోసాను ప్రారంభించామని.. మార్చి నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతుభరోసా వేస్తామన్నారు.భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామన్నారు.మొదటి ఏడాదిలోనే 55,142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. నీలాగా నేను మాటలు చెప్పి ఎగ్గొట్టే రకం కాదని.. కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు గాడిద గుడ్డిచ్చారని.. అయినా ఆయన బుద్ధి మారలేదన్నారు.

ఫామ్ హౌస్ లో పడుకొని గంభీరంగా చూస్తున్నారట అంటూ ఎద్దేవా చేశారు.జహంగీర్ పీర్ కి 100 కోట్లు ఇస్తానని మోసం చేశారంటూ విమర్శించారు.
రాజరాజేశ్వర స్వామికి 100 కోట్లు ఇస్తానని ఆయన్ని మోసం చేశావన్నారు. పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టారని.. కేసీఆర్ కోసం ఎవరూ ఎదురు చూడడం లేదన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటున్నారు అంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ ముందు అల్లుడు, కొడుకును దారిలో పెట్టుకోవాలన్నారు. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నామని.. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందామన్నారు. కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు అని.. మమ్మల్ని అభినందించడానికి మనసు రాకపోతే ఫామ్ హౌస్ లో పడుకోవాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications