Osmania Hospital: ఉస్మానియా కొత్త ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
Osmania Hospital: రాష్ట్ర ప్రజలకు అత్యాధునికి వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర మంత్రులతో కలిసి ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు.
ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రి అఫ్జల్ గంజ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నూతన ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. 2వేల పడకల సామర్థ్యంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మించనుంది.

రూ.2400 కోట్లతో 14 అంతస్తుల్లో కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాలలో వైద్య సేవలు అందించేలా.. రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త ఆస్పత్రిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు, ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, అన్ని రకాల డయాగ్నస్టిక్ సేవలు, ఐసీయూ వార్డులు అందుబాటులోకి రానున్నాయి.
Hon'ble CM A. Revanth Reddy participates in Laying of Foundation Stone for Osmania General Hospital - OGH New Building https://t.co/P8ip1mn9q9
— Telangana CMO (@TelanganaCMO) January 31, 2025
నూతన భవనం ప్రారంభోత్సవం తర్వాత 20 శాతం వైద్యుల సంఖ్య పెరగనుంది. రోజూ 5 వేల మంది ఓపీ రోగులను చూసేలా వైద్యులు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కేకే, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఒవేసీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications