రేవంత్ మంత్రివర్గ విస్తరణ లో వారికి ఛాన్స్ లేనట్లే..!!
తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. మంత్రివర్గంతో పాటుగా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన ఏఐసీసీ ఫోకస్ చేసింది. అయిదు రోజుల ఢిల్లీ పర్యటన లో భాగంగా పార్టీ అగ్రనాయకత్వంతో రేవంత్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవుల విషయం పైన రేవంత్ స్పష్టత ఇచ్చారు. ఎవరికి దక్కేదీ సంకేతాలు అందించారు.
ఛాన్స్ దక్కేదెవరికి
రేవంత్ మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ స్థానాల కోసం కాంగ్రెస్ నుంచి పలువురు రేసులో ఉన్నారు. నిజామాబాద్, అదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ఈ సారి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. పలువురు సీనియర్లు ఢిల్లీలో తమ పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే వారికి మంత్రి పదవులు ఇవ్వబోమన్నారు.

రేవంత్ స్పష్టత
కాంగ్రెస్ బీ-ఫామ్‌పై పోటీ చేసి గెలిచిన వారికి మాత్రమే కేబినెట్‌లో చోటు దక్కుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూలై ఫస్ట్ వీక్‌లో కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు కేబినెట్ విస్తరణ ఉండబోతుందని సమాచారం. మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పలువురు నేతలకు షాకిచ్చినట్లయింది. బీఆర్ఎస్ బీ-ఫామ్‌పై గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరితో పాటు ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కనున్నాయని ప్రచారం జరిగింది.
తుది కసరత్తు
కాగా, దీనిపై పార్టీలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ బీ ఫారం నుంచి పోటీ చేసిన వారికే మంత్రి పదవులు ఉంటాయని రేవంత్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మండలి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ పైన రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. టీపీసీసీ పదవితో పాటుగా మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications