గుడ్ జాబ్.. గ్రేట్ వర్క్
హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు తెరపడింది. విఘ్న నాయకుడు నిమజ్జనానికి తరిలాడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్రలు ముగిశాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటాయి. ఆద్యంతమూ వినాయక విగ్రహాల నిమజ్జనం సాఫీగా, అంగరంగ వైభవంగా పూర్తయ్యాయి. రెండో రోజు కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగింది.
ఈ నిమజ్జనోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. నేరుగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్లు, నగర పోలీస్ కమిషనర్, ఇతర అధికారుతో కలిసి నెక్లెస్ రోడ్ మార్గంలో ఫుట్‌పాత్‌పై కలియతిరిగారు. ఖైరతాబాద్ బడా గణపతిని నిమజ్జనం చేసిన క్రేన్ నంబర్ 4 వద్దకు వెళ్లారు. నిమజ్జనం తీరుతెన్నులను అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

క్రేన్ ఆపరేటర్లతో మాట్లాడారు. విగ్రహాల నిమజ్జన సమయంలో వాళ్లు పాటించే జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం, ట్యాంక్ బండ్ వైపు కారు ఫుట్ బోర్డ్ పై నిల్చుని కలియతిరిగారు. అశేష జనావళికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనూహ్యంగా రేవంత్ రెడ్డి తమ మధ్యలో ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, సెల్ఫీలు దిగడానికి జనం ప్రయత్నించారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ అధికారులను అభినందించారు.
మండపాలకు ఎటువంంటి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా డిస్కమ్ అధికారులు ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహాకులు, క్రేన్ ఆపరేటర్లు అందరికీ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలకు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications