ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి సాలిడ్ వార్నింగ్.. అలా చేస్తే 10శాతం జీతం కట్!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన పైన దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గ్రూప్ వన్ విజేతలకు నియామక పత్రాలను అందిస్తూ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణా రాష్ట్రం ఒక కుటుంబం సొత్తు కాదన్న సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా జరిగింది? నాడు ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ఆరు దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమ గురుతులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబం, ఒక పార్టీ సొత్తు అనుకునే రోజులు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

నియామకాల పైన ఎన్నికల ఫలితాలకంటే ఎక్కువ టెన్షన్ పడ్డా
గత ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గత పదేళ్లలో గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదని, నియామకాల విషయంలో పారదర్శకత పాటించకుండా ఉద్యోగాలు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీ నియామకాల పైన ఎన్నికల ఫలితాలు కంటే ఎక్కువ టెన్షన్ పడ్డానని సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ లో ఎంపికైన అభ్యర్థులకు తెలిపారు.
గ్రూప్ 1 ఉద్యోగులకు సీఎం రేవంత్ సాలిడ్ వార్నింగ్
ఇక ఇదే సమయంలో రెండు, మూడు కోట్లు తీసుకుని గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నానని తన పైన విషప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆయన ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి అంటూ ఆరోపించారు. గ్రూప్ వన్ కోసం మూడు లక్షల మంది పోటీ పడితే 562 మంది ఎంపిక అయ్యారని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇదే సమయంలో గ్రూప్ వన్ ఉద్యోగులకు సాలిడ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
తల్లిదండ్రుల విషయంలో అలా చేస్తే చర్యలే
ఉద్యోగులు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం . ఉద్యోగులు ప్రజాసేవలో తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి అని సీఎం సూచించారు. త్వరలో తల్లిదండ్రుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఎవరైతే తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తారో వారి జీతం నుండి 10 శాతం కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాలలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తల్లిదండ్రుల సంక్షేమం కోసం చట్టం తెస్తామన్న సీఎం
మీ కళ్ళల్లో కంటే మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని నేను కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికగా స్పష్టం చేశారు. ఇక తాజా ప్రకటనతో త్వరలోనే తల్లిదండ్రుల సంక్షేమం కోసం చట్టం తీసుకురాబోతున్నారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది.












Click it and Unblock the Notifications