హైదరాబాద్ లో మరో భారీ బ్రిడ్జి: రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్ లో మరో భారీ బ్రిడ్జి నిర్మితం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. దీని నిర్మాణానికి అవసరమైన నిధులను ఇదివరకే మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. టెండర్లను ఆమోదిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రోడ్ కనెక్టివిటీని మరింత మెరుగుపర్చడానికి, వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ బ్రిడ్జిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రాత్మక మీరాలం ట్యాంక్ పై ఈ వంతెన రూపుదిద్దుకోనుంది. ఐకనిక్ బ్రిడ్జిగా నిర్మితం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని నిర్మాణానికి 430 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.

ఈ వంతెన నిర్మాణంతో శాస్త్రీపురం నుంచి చింతల్‌మెట్ మీదుగా బెంగళూరు జాతీయ రహదారికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. జాతీయ రహదారి 44- చింతల్‌మెట్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాన్ని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) సమకూర్చుతుంది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) విధానంలో టెండర్లను ప్రారంభించాలని ఎమ్మార్డీసీల్ ను ప్రభుత్వం ఆదేశించింది.

మీరాలం ట్యాంక్ పనుల పురోగతిని రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఉన్నతాధికారులతో కలిసి ఓపెన్ టాప్ జీప్ లో చెరువు పరిసర ప్రాంతం అంతటా ప్రయాణించారాయన. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. నూతన డిజైన్లు, భవిష్యత్ ప్రణాళికల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు ఇచ్చారు.
నిర్మాణ పనులను పరిశీలించడానికి భారీ క్రేన్ పైకి ఎక్కి మరీ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులను స్వయంగా వీక్షించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజాం కాలం నాటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు మధ్యలో గల ఐలాండ్ ను సింగపూర్ లోని గార్డెన్ బై ద బే తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. పర్యాటకులు ఇక్కడ గడిపేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, ల్యాండ్ స్కేపింగ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని అన్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరాలం చెరువు అత్యంత సమీపంలో ఉండటం ఓ సానుకూలాంశమని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈ ట్యాంక్ ను మలచాలని సూచించారు. ఇందులో భాగంగా పర్యాటకుల కోసం వాటర్ స్పోర్ట్స్ ప్రవేశపెట్టాలని, ఆధునిక బోటింగ్ సదుపాయాలతో పాటు చెరువు పరిసరాలలో పిల్లలకు, పెద్దలకు ఉల్లాసాన్ని కలిగించే వినోద కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నిర్దేశించారు.













Click it and Unblock the Notifications