తగ్గేదే లే.. ఆ ప్రాజెక్ట్‌పై ముందుకే: కుండబద్దలు కొట్టిన రేవంత్
Revanth Reddy: మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పి కొట్టారు. ఎదురుదాడికి దిగారు. కిషన్ రెడ్డిని గుజరాత్ కా గులామ్‌గా అభివర్ణించారు. తమ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందడాన్ని ఓర్వలేకపోతున్నాడంటూ విమర్శించారు.
రేవంత్ రెడ్డి ప్రస్తుతం నాగ్‌పూర్‌లో ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ థాకరే)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)- కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తోన్నారు. మహా వికాస్ అగాఢీ అభ్యర్థుల కోసం తెలుగు వాళ్లు ఎక్కువగా స్థిరపడిన నియోజకవర్గాల్లో పర్యటిస్తోన్నారు.

ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు చేపట్టిన మూసీ నిద్ర గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోంటే నిందలు వేస్తోన్నారంటూ ఆరోపించారు.
గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తే కిషన్ రెడ్డి చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారని, ఆ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం 50,000 మందిని తరలించిందని గుర్తుచేశారు. అలాంటి ప్రాజెక్టే తాము చేపడితే విమర్శలు గుప్పిస్తోన్నాడని, దీన్ని వ్యతిరేకిస్తోన్నాడని అన్నారు. దీన్ని బట్టి చూస్తే కిషన్ రెడ్డి గుజరాత్‌కు గులాంలా మారినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
గుజరాత్ మోడల్‌కు ధీటుగా తెలంగాణ మోడల్ అభివృద్ధి చెందుతోందని, ఇది దేశానికే రోల్ మోడల్ అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తన సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు దేశం మొత్తానికీ ఆదర్శవంతమౌతాయని, గుజరాత్ మోడల్ ఘోరంగా విఫలమౌతుందని చెప్పారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. సొంత కుంపటి పెట్టుకుని మహారాష్ట్ర ప్రజలను ఏరకంగా అయితే మోసగించారో.. అదే తరహాలో జీ కిషన్ రెడ్డి కూడా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోన్నాడంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కిషన్ రెడ్డి సహా తెలంగాణ బీజేపీ నాయకులు ఏమనుకున్నా గానీ మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేస్తామని అన్నారు. తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్‌గా నిలుపుతామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications