SLBC: టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రివ్యూ, కీలక ఆదేశాలు
SLBC Tunnel: నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఘటన స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. గాయపడ్డ వారి పరిస్థితిని ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలని చెప్పారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు వివరించారు. సహాయక చర్యల విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్‌కు ప్రధాని మోడీ ఫోన్
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి మోడీకి తెలియజేశారు.
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి వివరించారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రికి చెప్పారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపిస్తామని మోడీ ముఖ్యమంత్రికి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి మోడీ హామీ ఇచ్చారు.
కాగా, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు డీఐజీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను హుటాహుటిన ప్రమాదస్థలికి పంపించారు.












Click it and Unblock the Notifications